CM YS Jagan Siddham Public Meeting: నా వెంట ఎవరున్నా లేకున్నా మీరుంటే చాలు అంటూ బహిరంగ సభల్లో సీఎం జగన్ ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తున్నా పెద్దగా స్పందన కనిపించడం లేదు. శనివారం ఏలూరులో నిర్వహించిన సిద్ధం సభతో ఇది తేటతెల్లమైంది. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే జనం ఇళ్ల బాట పట్టారు. వారం ముందు నుంచే సీఎం సభకు జనాన్ని తరలించాలని ప్రతి వాలంటీర్‌కు పార్టీ పెద్దలు లక్ష్యాన్ని నిర్దేశించారు. వారు సభలకు జనాన్ని తెచ్చేందుకు నానా యాతన పడ్డారు.
బోసిపోయిన గ్యాలరీలు: ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జనాన్ని రప్పించేందుకు చాలాచోట్ల నాయకులు బతిమాలుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి 70 బస్సులు ఏర్పాటు చేసినా, కేవలం పది బస్సుల్లో అదీ పల్చగా ప్రజలు వెళ్లారు. సీఎం ప్రసంగం మొదలయ్యే సరికే వెనకనున్న గ్యాలరీలు ఖాళీ అయ్యాయి. ప్రసంగం సగం ముగిసేసరికి మరిన్ని గ్యాలరీలు బోసిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు, నాయకులు ముందు గ్యాలరీల్లో ఉన్నవారిని బయటికి రాకుండా అడ్డుకున్నారు.
సాయంత్రం వరకు నిల్చోలేక:సభకు వెళ్లిన జనం నానా అవస్థలు పడ్డారు. పల్లెల నుంచి శనివారం ఉదయం 8 గంటలకే బస్సులు బయల్దేరగా, మధ్యాహ్నానికి వేదిక వద్దకు జనం చేరుకున్నారు. అక్కడ మండుటెండలో ఉక్కపోతతో అల్లాడిపోయారు. పలువురు సొమ్మసిల్లి పడిపోగా, కొందరు వాంతులు చేసుకున్న దృశ్యాలు కనిపించాయి. ఓ పోలీస్ కానిస్టేబుల్ స్పృహతప్పి పడిపోగా, వైద్య శిబిరానికి తరలించి సెలైన్ పెట్టారు. సభ వద్ద కుర్చీలు లేకపోవటంతో సాయంత్రం వరకు నిల్చోలేక కొందరు సీఎం రాకముందే వెళ్లిపోయి బస్సుల్లో కూర్చున్నారు.
అడుగడుగునా నిబంధనలకు పాతర -'సిద్ధం' కోసం ఇంత విధ్వంసమా - ఇదేం పని జగనన్నా?
ఫ్లెక్సీలు కన్పించేందుకు చెట్ల కొమ్మలు కొట్టేసి: సభకు జనాన్ని తరలించేందుకు సుమారు 3 వేల వాహనాలు ఏర్పాటు చేయగా, ఏలూరుకు వచ్చే అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం 11 గంటలకే దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. సాయంత్రం సభ ముగిశాక దాదాపు 3 గంటల పాటు ట్రాఫిక్ సమస్య కొనసాగింది.