CM YS Jagan Met YSRCP Rebel Candidates: సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అసంతృప్తి నేతలు కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తి విమానాశ్రయంలో జగన్ దిగిన వెంటనే వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వ్యతిరేక వర్గ నేతలు సోమశేఖర్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డిలు కలిశారు. వీరిని చూడగానే సీఎం పలకరించి, వారు తెచ్చిన శాలువను వారికే కప్పి మాట్లాడారు.
పుట్టపర్తిలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి పని చేయాలని సీఎం జగన్ చెప్పగానే, తాము అతనితో పని చేయలేమని సోమశేఖర్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డిలు సీఎంకు స్పష్టం చేసినట్లు సమాచారం. అందరూ కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో శ్రీధర్ రెడ్డి ఇంట్లో కూర్చొని మాట్లాడాలని జగన్ చెప్పారు. అయితే తాము శ్రీధర్ రెడ్డి ఇంటికి వెళ్లేది లేదని, మరోచోటు చెబితే తాము కలవటానికి సిద్ధంగా ఉన్నామని అసంతృప్త నేతలు సోమశేఖర్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డిలు తెలిపారు. వీరితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యత అప్పగించినట్లు సమాచారం.
రేపో ఎల్లుండో వైసీపీ ఐదో జాబితా - టికెట్ ఉంటుందో ఊడుతుందో తెలియక నేతల టెన్షన్
మరోవైపు ఉరవకొండలో నిర్వహించిన సీఎం సభలో మంత్రి ఉష శ్రీచరణ్, ఎంపీ తలారి రంగయ్యలు పక్కపక్కనే కూర్చున్నా ఎడముఖం, పెడముఖంగా ఉన్నారు. నాలుగేళ్లుగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తలారి రంగయ్య వర్గానికి, మంత్రి ఉష శ్రీచరణ్ వర్గానికి మధ్య ఆదిపత్యపోరు సాగుతోంది. దీంతో ఈ వర్గాలకు ఆధిపత్యం వహిస్తున్న ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్న విషయం కళ్యాణదుర్గంలో అనేకసార్లు బట్టబయలైంది.