YS Rajashekar Reddy 75th Birth Anniversary :వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాభవన్‌లో నిర్వహించిన వైఎస్ఆర్ ఫొటో ఎగ్జిబిషన్‌కు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ పాదయాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం :మూసీ ప్రక్షాళన చేయాలనే ఆలోచన వైఎస్‌ఆర్ స్ఫూర్తితోనే ప్రభుత్వం చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం పేదలకు అందుతుంది అని పేర్కొన్నారు. గతంతో రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని వైఎస్ఆర్ సంకల్పించారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే రాహుల్‌ను ప్రధానిని చేసే విధంగా తాము ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. గతంలో వైఎస్సార్ పాదయాత్రతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇటీవల రాహుల్‌గాంధీ పాదయాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు.
"కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తున్నారు. ఇటీవల పార్లమెంటులో మోదీ విధానాలను రాహుల్ ఎదుర్కొన్నారు. దేశ ప్రధాని పదవికి రాహుల్‌గాంధీ ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం వైఎస్‌ఆర్ ఆశయం. దాని కోసం అందరూ అండగా నిలవాలి. రాహుల్‌ను ప్రధానిగా చేయడానికి ఎవరు అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్సార్ వారసులు. రాహుల్ ప్రధాని పదవికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే వైఎస్ వ్యతిరేకులే." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి