ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

గంటలకొద్దీ జగన్​ రోడ్​షో - పోలీసుల అత్యుత్సాహం - జనానికి రెట్టింపు ఇబ్బందులు - CM Jagan Tour Heavy Traffic Jam

CM Jagan Tour Heavy Traffic Jam: మేమంతా సిద్ధం అంటూ జగన్‌ చేస్తున్న బస్సు యాత్ర జనానికి నరకాన్ని చూపిస్తోంది. విజయవాడలో బలప్రదర్శన కోసం వేల మంది ప్రజలకు చుక్కలు చూపించారు. బస్సు యాత్రకు జనాలు విరగబడిపోతున్నట్లు చూపించేందుకు డ్రోన్‌ షాట్లు, వీడియో చిత్రీకరణ కోసం గంటల తరబడి హైవేని స్తంభింపజేశారు.

CM_Jagan_Tour_Heavy_Traffic_Jam
CM_Jagan_Tour_Heavy_Traffic_Jam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 7:19 AM IST

గంటలకొద్దీ జగన్​ రోడ్​షో - పోలీసుల అత్యుత్సాహం - జనానికి రెట్టింపు ఇబ్బందులు

CM Jagan Tour Heavy Traffic Jam:బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్న జగన్‌ శనివారం పరాకాష్ఠకు చేర్చారు. 14వ రోజు యాత్రను గుంటూరు జిల్లా నంబూరు బైపాస్‌ వద్ద నుంచి ఆయన కనకదుర్గ వారధి మీదుగా సాయంత్రానికి విజయవాడలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో వారధిపైన డ్రోన్‌ షాట్లతో ఫొటో, వీడియో షూట్‌ పెట్టుకున్నారు. వారధి మొత్తం జనసందోహంతో నిండిపోయినట్లు డ్రోన్‌ వీడియో, ఫొటో షూట్లలో కనిపించేలా చేసేందుకు అంతకు ముందు గుంటూరు - విజయవాడ మధ్య జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిపేశారు.

దీంతో ఏప్రిల్‌ నెల ఎండలో ప్రయాణికులకు, వాహనదారులకు నరకమేంటో అనుభవంలోకి వచ్చింది. ఈ ప్రభావంతో మొత్తంగా నాలుగు గంటలపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. కొందరైతే వేచి చూసి చూసి విసిగిపోయారు. వేదనతో కళ్లలో నీళ్లు తెచ్చుకున్నారు. వారధి మీదుగా విజయవాడలో ప్రవేశించిన తర్వాతా పోలీసులు అత్యుత్సాహం చూపించటంతో ట్రాఫిక్‌ మొత్తం అతలాకుతలమైపోయింది. జనజీవనం స్తంభించిపోయింది.

సీఎం బస్సుయాత్రలో కలకలం - గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో జగన్ కంటి నుదిటిపై స్వల్పగాయం - Attack on CM Jagan With Stone

చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి అత్యంత ప్రధానమైనది. అందులో గుంటూరు-విజయవాడ మధ్య ఒక్క గంటలోనే వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సాయంత్రం వేళ ఈ రద్దీ మరింత తీవ్రంగా ఉంటుంది. గుంటూరు నుంచి విజయవాడకు చేరుకోవటానికి బైపాస్‌ కూడా లేదు. వారధి మీదుగా ప్రయాణించాల్సిందే.

ఏ మాత్రం ఇంగితం ఉన్నవారైనా అలాంటి మార్గంలో వీలైనంత వరకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించకూడదనే ప్రయత్నిస్తారు. జాతీయ రహదారి మొత్తం ఆరు వరుసలుగా ఉంది. తప్పనిసరైతే ఒకటి, రెండు వరుసల్లో యాత్రకు అనుమతించి మిగతా వరుసల్లో సాధారణ ప్రయాణికుల రాకపోకలు కొనసాగేలా చూడొచ్చు. కానీ జగన్‌ కోసం ఏకంగా మొత్తం రహదారినే స్తంభింపజేసేశారు. వేలాది మంది వాహనదారులు మండుటెండలో అల్లాడిపోయారు.

అసలు ఇంతటి కీలకమైన జాతీయ రహదారిపై యాత్రకు ఎన్నికల సంఘం ఎలా అనుమతిచ్చింది? యాత్ర మొదలైనప్పటి నుంచి ఆయన జాతీయ, రాష్ట్ర రహదారులపై ట్రాఫిక్‌ను నిలిపేస్తూ ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తూనే ఉన్నారు కదా! వాటిని చూస్తూ కూడా ఎన్నికల సంఘం జాతీయ రహదారిపై ఈ యాత్రకు అనుమతులు కొనసాగిస్తోంది? ఎందుకు వాటిని రద్దు చేయదు? ఇప్పటికైనా జాతీయ రహదారులపై జగన్‌ యాత్రకు అనుమతులు రద్దు చేయకపోతే ప్రజలకు మున్ముందు మరింత నరకం చూపించటం తథ్యంగా కనిపిస్తోంది.

వైఎస్సార్సీపీ నేత దాష్టికం- కాలిన గాయాలతో బయటపడిన ఒంటరి మహిళ! నామమాత్రపు సెక్షన్లతో కేసు - YSRCP Leader Attack on Women

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి నెల రోజులవుతున్నా పోలీసులు ఇంకావైసీపీ సేవలో తరించటమేంటి.? ముఖ్యమంత్రి అయితే ఆయనకేమైనా ప్రత్యేక హక్కులుంటాయా.? జగన్‌ తన పార్టీ తరఫున రాజకీయ ప్రచారం కోసం తిరుగుతుంటే దాని కోసం జాతీయ రహదారిపై రాకపోకల్ని స్తంభింపజేయటమేంటి.? వేలమందికి ఇబ్బందులు సృష్టించిన జగన్, పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్న వాదన వినిపిస్తోంది.

తాడేపల్లి వద్ద సర్వీసు రోడ్డులో మార్నింగ్‌స్టార్‌ ట్రావెల్స్‌ వద్ద మధ్యాహ్న భోజన విరామం కోసం 2 గంటల సమయంలో జగన్‌ ఆగారు. దాదాపు నాలుగున్నర వరకూ అక్కడే ఉన్నారు. అప్పుడు కూడా పోలీసులు అత్యుత్సాహం చూపించి జాతీయ రహదారిపై, సర్వీసు రోడ్డులోకి వచ్చే మార్గంలోనూ ట్రాఫిక్‌ ఆపేశారు. ఆయన సర్వీసు రోడ్డులో బస చేస్తే జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఆపాల్సిన అవసరమేంటి.?

గుంటూరు-విజయవాడ మధ్య ప్రయాణ సమయం గరిష్ఠంగా 45 నిమిషాలు. కానీ జగన్‌ ప్రచార పిచ్చి వల్ల ట్రాఫిక్‌ను నిలిపేయటంతో శనివారం దాదాపు 4 గంటల సమయం పట్టింది. చెన్నై- కోల్‌కతా లాంటి అత్యంత రద్దీ జాతీయ రహదారిని గుంటూరు-విజయవాడ మధ్య కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వడ్డేశ్వరం బైపాస్‌ రోడ్డులో ఎయిమ్స్‌కు వెళ్లే కూడలి వద్ద మూడున్నర గంటల పాటు పోలీసులు వాహనాలను నిలిపివేయించారు.

షర్మిల Vs విమల - కుటుంబ సభ్యుల పరస్పర ఆరోపణలతో హీటెక్కుతోన్న పులివెందుల - YS SHARMILA VS YS VIMALA REDDY

దీంతో పసిపిల్లలతో ప్రయాణిస్తున్న తల్లులు నరకం అనుభవించారు. బస్సుల్లో గాలి ఆడక చిన్నారులు ఏడుస్తుంటే సముదాయించలేక ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది తమ వాహనాలు వెనక్కి తీసుకుని జాతీయ రహదారి పైకి వెళితే ఆ దారిలో వడ్డేశ్వరం వాహనాల్ని ఆపేశారు. మండుటెండలో ద్విచక్రవాహనదారులు అల్లాడిపోయారు. కొందరైతే వడదెబ్బకు గురయ్యారు. కార్లలో, బస్సుల్లో ఉన్న వారంతా ముందుకు కదల్లేక, వెనక్కి వెళ్లలేక చిక్కుకుపోయి నరకయాతను అనుభవించారు. జగన్‌ బస్సు యాత్ర పాత టోల్‌గేట్‌ వద్దకు చేరుకున్న తర్వాత వాహనాలను వదిలారు.

విజయవాడలో జగన్‌ యాత్ర సందర్భంగా బస్సుల్ని దారి మళ్లించారు. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ను నిలిపేశారు. అంతర్గత రోడ్లనూ బారికేడ్లతో మూసేశారు. దీంతో విజయవాడ అతలాకుతలమైంది. జగన్‌ విజయవాడలోకి ప్రవేశించే ముందే చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిపేశారు. ఏలూరు వైపు నగరంలోకి వచ్చే వాటిని బయటే నిలిపేశారు. గుంటూరు వైపు నుంచి వచ్చేవాటిని తాడేపల్లి వద్ద ఆపేశారు.

సీఎం జగన్‌ బందరు రోడ్డులోకి ప్రవేశించిన తర్వాత ఒకేసారి వాహనాలు వదలడంతో వారధి నుంచి ఎనికేపాడు వరకు ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. ఈ ప్రభావం విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల వరకు వ్యాపించి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో పైవంతెనపై సీఎం వెళ్లిన తర్వాత కూడా ట్రాఫిక్‌ కష్టాలు తీరలేదు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను విమానాశ్రయం నుంచి తీసుకొచ్చేందుకు వెళ్తున్న కాన్వాయ్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.

రహదారులపై సభలు, సమావేశాలు నిర్వహించటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులకు సకాలంలో వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారంటూ గతేడాది జనవరిలో జగన్‌ జీవో నెంబర్‌ ఒకటిని తెచ్చారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై సభల నిర్వహణ రాకపోకలకు ఆటంకం కలిగి దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్‌ సరఫరాపై ప్రభావం పడుతోందని ఆ సందర్భంగా చెప్పారు. ప్రతిపక్షాలను అణచివేయడానికి తెచ్చిన ఈ చీకటి జీవోను న్యాయస్థానాలు కొట్టేశాయి. ప్రతిపక్షాలను వేధించేందుకు అప్పట్లో ఇలాంటి జీవో తెచ్చిన జగన్‌ ఇప్పుడు ఆ నిబంధనలు ఎందుకు పాటించరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సూపర్​ సిక్స్​ స్కీమ్స్ ప్రచారంతో దూసుకెళ్తోన్న టీడీపీ - TDP Candidates State Wide Campaigns

ABOUT THE AUTHOR

...view details