CM Jagan Introduced MP and MLA Candidates :'వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను మంచివారు. సౌమ్యులు' అని ముఖ్యమంత్రి జగన్ పరిచయం చేస్తుండటంతో ప్రజలు నవ్వుకుంటున్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు. అంత సౌమ్యులెప్పుడయ్యారా అని ఆలోచనలో పడుతున్నారు. సోమవారం గుడివాడలో చేపట్టిన 'మేమంతా సిద్ధం' సభలో జగన్ కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేసిన తీరు చూసి జిల్లా వాసులు అవాక్కవుతున్నారు. ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు ముఖ్యమంత్రికి తెలియదా? తెలిసినా కవర్ చేస్తున్నారా? అని చర్చించుకుంటున్నారు.
మంత్రి జోగి రమేష్ సౌమ్యుడు :గుడివాడలోని నాగవరప్పాడులో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ కృష్ణా జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను జనాలకు పరిచయం చేశారు. మంత్రి జోగి రమేష్ సౌమ్యుడు అనగానే జనాలు ఘొల్లుమన్నారు. గోలగోల చేశారు. నోరు వేసుకుని ప్రతిపక్షాలమీద పడిపోయే జోగి రమేష్ సౌమ్యుడు అంట. జనాలను మారణాయుధాలను వేసుకుని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటి మీదకు దాడికి వెళ్లారు. జోగి అనుచరులు మైలవరం, పెడన, పెనమలూరు నియోజకవర్గాల్లోనూ కార్యకలాపాలను విస్తరించారు.
కొంతమంది యువకులు ఓ పెళ్లి బృందంపై దాడికి పాల్పడ్డారు. ఆయన వర్గం జి.కొండూరులో దేవినేని ఉమాపై దాడి చేశారు. ఇక పెడనలో వసూలు రాజాలు సరేసరి. పెనమలూరుకు వచ్చిన తర్వాత ఇసుక దందా అంతా ఇంతా కాదు. ఇక్కడ ఉంటూ మైలవరంలో బూడిద దందా సాగిస్తున్న తీరు ఆదర్శనీయమే. అంత సౌమ్యుడు అయిన జోగి రమేష్ టీడీపీ నాయకులపై ఒంటికాలు మీద లేస్తుంటారు. ఆయనకు చల్లని దీవెనలు కావాలని జగన్ కోరడం విచిత్రంగా అనిపించింది.
ఏంటీ వీళ్లు మంచోళ్లా? - ఒకసారి ఈ అరాచకాలు చూద్దామా జగన్? - CM Jagan Lies about YCP Candidates
కొడాలి నాని :కొడాలి నానిని మాత్రం సీఎం జగన్ సౌమ్యుడుగా అభివర్ణించలేదు. ఆయన ఇంకా చాలా మంచి చేస్తారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారు. రోడ్లు వేయలేదు. ఆర్వోబీ పూర్తి చేయలేదు. టీడీపీ నిర్మాణం చేసిన టిడ్కో ఇళ్లు పంచినా మౌలిక వసతులు పూర్తి చేయలేదు. ఇప్పటి వరకు మంచి చేయకపోయినా ఈసారి చేస్తారని సీఎం భాష్యం చెప్పారు. ఈసారి తనే దగ్గరుండి చేయిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ గత అయిదేళ్లు ఏమీ చేయించలేదన్నమాట!
వల్లభనేని వంశీ :గన్నవరం టీడీపీ కార్యలయంపై దాడి జరిగిన దానికి ప్రధాన సూత్రధారి వల్లభనేని వంశీ. యువగళం పాదయాత్రలో దాడులు జరిగిన దానికి ప్రత్యక్ష పాత్రధారి. ఆయనే స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులను బెదిరించి లొంగదీసుకోవడం లేదా కేసులు పెట్టించడమనే మంచి పేరు ఉంది. జాస్తి వెంకటేశ్వరావుపై జేసీబీ పెట్టి కూల్చివేతలు ప్రోత్సహించారు. మరో రైస్ మిల్లరుకు తుపాకీ ఎక్కుపెట్టినట్లు నియోజకవర్గంలో ప్రచారం. ఇలాంటి వంశీ సీఎం దృష్టిలో సౌమ్యుడా!