White paper on Law and order : ఆంధ్రప్రదేశ్ ను సున్నా నేరాల రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల విషయంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని తెలిపిన ఆయన అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధమని ప్రకటించారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు మానసికంగా శారీరకంగా వేదన అనుభవించారని సీఎం స్పష్టం చేశారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో శాంతిభద్రతల అంశంపై సీఎం ఏపీ శాసనసభలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రాజకీయ కక్షతీర్చుకోడానికి అధికారం కాదని.. అలాగని తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించటంలో ఎలాంటి రాజీ ఉండబోదని చంద్రబాబు తేల్చి చెప్పారు. మరోవైపు పోలీసు శాఖనూ ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ను శాంతి భద్రతల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సున్నా నేరాల నమోదు రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు మానసికంగా శారీరకంగా వేదన అనుభవించారని.. భయానకమైన పరిస్థితుల్లో జీవించారని సీఎం ఆక్షేపించారు. శాసనసభలో ఐదేళ్ల వైసీపీ పాలనలోని శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అక్రమకేసులు, అణచివేతపై కమిషన్ వేసే అంశాన్ని కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్ఫష్టం చేశారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ప్రజలు అధికారం ఇవ్వలేదని.. అయితే తప్పు చేసినవారిని చట్టపరంగా శిక్షించటంలో ఎలాంటి రాజీ ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. అధికారం ప్రతీకారం కోసం కాదని ప్రజా సేవకోసమే అని గుర్తించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఎన్డీఎ పక్షాలు చట్టాన్ని చేతులోకి తీసుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరాలు చేసేందుకు రాజకీయ ముసుగువేసుకున్నవారిని కఠినంగా శిక్షించి తీరుతామని సీఎం తేల్చి చెప్పారు. శాంతిభద్రతలను విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారు ఏస్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ లో 2019-24 మధ్య చీకటిపాలన కొనసాగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్ట్రీట్ టెర్రజిజం కొనసాగిందని ఆక్షేపించారు. ప్రతిపక్షాలను ప్రజల గొంతుకల్ని అణచివేసేందుకు జగన్ ప్రభుత్వం వందలు వేల సంఖ్యలో కేసులు పెట్టిందని అన్నారు. టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు ఇతర నేతలపై పదుల సంఖ్యలో కేసులు పెట్టారని.. తనపై కూడా 17 కేసులు గత ప్రభుత్వ హయాంలో పెట్టారని ముఖ్యమంత్రి అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైనా దుర్మార్గంగా గత ప్రభుత్వం ప్రవర్తించిందన్నారు. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణం రాజును లాకప్ లో చిత్రహింసలు పెట్టి వీడియోలు చూసి మాజీ సీఎం పైశాచికానందం పొందారన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ సహా ప్రస్తుత హోం మంత్రి అనితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, స్పీకర్ అయ్యన్న పాత్రుడుపైనా రేప్ కేసు పెట్టారన్నారు. కేసులు ఉన్న సభ్యులు శాసనసభలో ఎంతమంది ఉన్నారో తెలియచేసేందుకు లేచి నిలబడాలని సీఎం విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సహా చాలా మంది సభ్యులు తన స్థానాల్లో లేచి నిలబడ్డారు.
ప్రజా ప్రతినిధులు, ప్రతిపనేతలు, న్యాయమూర్తులు, మీడియా, ఉద్యోగులు, టీచర్లు ఇలా అందర్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని అన్నారు. జగన్ సర్కారు కక్షసాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేతలతో కొందరు పోలీసు అధికారులు కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు. అధికార పార్టీ నేతలతో విబేధిస్తే పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధించారని అన్నారు. ఐదేళ్ల పాటు వీఆర్ లో ఉన్న అధికారులూ ఉన్నారని స్పష్టం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడినందుకు బాబ్లీ ప్రాజెక్టులో తనపై కేసులు పెట్టారని వైసీపీ అధికారంలోకి వచ్చాక తనపై కేసులు పెట్టిందని అన్నారు. పలనాడు సహా వేర్వేరు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తల్ని పైశాచికంగా నరికి చంపారని సీఎం అన్నారు.