TDP BJP Janasena Alliance in AP Elections 2024 : ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు విశ్వరూపం చూపించారు. ముసలోడు అని గేలి చేసిన వారు నోరు వెల్లబెట్టుకుని చూసేలా సుడిగాలి పర్యటనలు చేశారు. మండుటెండ, జోరు వర్షం, ప్రతికూల వాతావరణం ఇలా వేటినీ లెక్కచేయకుండా రాష్ట్రంలో విధ్వంస పాలనకు చరమగీతం పాడి ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ గాడిలో పెడదాం అనే నినాదంతో దూసుకెళ్లారు. అగ్నికి వాయువు తోడైనట్లుగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాటల తూటాలతో చెలరేగిపోయారు. పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ అంటూ జగన్ చేసిన ప్రకటనను సవాల్ గా తీసుకుని నిజమైన పెత్తందారు ఎవరో ప్రజలకు వివరించటంలో వీరు సక్సెస్ అయ్యారు. మరో మిత్రపక్షం బీజేపీని సమన్వయం చేసుకునే విషయంలో ఇద్దరు అధినేతలు భేషజాలకు పోకుండా తగ్గాల్సిన చోటల్లా తగ్గి ఎన్నికల్లో నెగ్గి చూపించారు.
ఏపీలో కూటమి సునామీ - 150కు పైగా స్థానాల్లో దూసుకుపోతున్న అభ్యర్థులు - AP Election Result
నాయకుల్లో భారీ ఆశలు, ఆకాంక్షలు, తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ ఈసారి తెలుగుదేశం టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియ నుంచి ప్రచారపర్వం ముగిసే వరకూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు ఎక్కడా గౌరవం తగ్గకుండా వ్యవహరించారు. పొత్తులో భాగంగా మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ ఆకాంక్షలకు, అభిప్రాయాలకు విలువ ఇస్తూ, వాటికి టిక్కెట్‌లు కేటాయించే క్రమంలో దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కొందరికి టిక్కెట్ ఇవ్వలేకపోయింది. కానీ ఊహించని రీతిలో అసంతృప్తులు తగ్గి జనసేన నేతలతో కలిసి పని చేయించటంలోనూ చంద్రబాబు క్రియాశీలకంగా వ్యవహరించారు. సాధారణంగా ప్రధాన రాజకీయ పార్టీల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నాయకులు తీవ్ర నిస్పృహకుగురవుతారు. నిరసనలు తెలియజేస్తారు. మద్దతుదారుల్ని కూడగట్టుకుని బలప్రదర్శనకు దిగుతారు. ఆందోళనలు నిర్వహిస్తారు. కానీ ఈసారి అలాంటి ఆందోళనలు చెదురుమదురుగా మాత్రమే చోటు చేసుకున్నాయి. టిక్కెట్ దక్కని నాయకుల అనుచరులు, మద్దతుదారులు కొన్ని చోట్ల నిరసన వ్యక్తం చేసినా వారిని పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి స్వయంగా మాట్లాడటంతో పరిస్థితి చాలా వరకు చక్కబడింది. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల భవిష్యత్తుని దృష్టిలోని ఉంచుకుని వైఎస్సార్సీపీ అరాచకపాలనను తెరదించేందుకు చేస్తున్న పోరాటంలో భాగంగా పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు వారికి వివరించారు. ఒక రాక్షస ప్రభుత్వంపై జరుగుతున్న పోరాటానికి అందరూ కలసి రావాలని, త్యాగాలకూ సిద్ధమవ్వామని ఆయన హితవు చెప్పారు. ఇప్పుడు త్యాగాలు చేసిన నాయకులకు పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యమిస్తామని, పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు మాటలతో సంతృప్తి చెందిన ఆ నాయకులు మిత్రపక్షాలకు చెందిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు.
ఓటమి బాటలో వైఎస్సార్సీపీ - కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న అభ్యర్థులు - YSRCP Leaving Counting Center
ఎన్టీఆర్, వాజ్‌పేయీ హయాం నుంచి టీడీపీ, బీజేపీ మధ్య మైత్రి కొనసాగుతున్నా మధ్యలో కొంత విరామం వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, బీజేపీ మళ్లీ జట్టు కట్టాయి. ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో జనసేన కూడా జతకలిసింది. అప్పట్లో గుంటూరులో జరిగిన సభలో మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చిలో ఇప్పుడు చిలకలూరిపేట వద్ద జరిగిన సభలో ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదికపైకి వచ్చారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో విస్తృతమైన యంత్రాంగం ఉంది. మారుమూల పల్లెల్లోనూ అంకితభావంగల కార్యకర్తలు, మద్దతుదారుల్ని కలిగి ఉండటం టీడీపీ బలం. 42 ఏళ్లకుపైగా సుదీర్ఘ ప్రస్థానంలో 22 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న టీడీపీలో ప్రస్తుతం రాష్ట్రంలో 60 లక్షలకుపైగా క్రియాశీల సభ్యులున్నారు. పార్టీ పిలుపును ఇంటింటికీ చేర్చగలిగే బలమైన సైన్యం ఆ పార్టీ సొంతం. 2019 ఎన్నికల్లో తెదేపా ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నా క్యాడర్‌ను చెక్కుచెదరకుండా కాపాడుకోగలిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తూ అతి త్వరలోనే మళ్లీ పుంజుకుంది. ఈ అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీ ముఖ్య నాయకులు అనేక మందిని జైల్లో పెట్టింది. పార్టీ క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలపైనా పెట్టిన అక్రమ కేసులు, అరాచకాలకు లెక్కేలేదు. వాటన్నిటినీ ఎదుర్కొంటూ చంద్రబాబు పార్టీని ముందుకి నడిపించారు.
పవన్ కల్యాణ్ జనసేనను ప్రారంభించినప్పుడు సినిమా హీరోగా ఆయనకున్న క్రేజ్ ఒక్కటే ఆ పార్టీకి ఉన్న ప్రధాన బలం. పదేళ్ల ప్రస్థానంలో రెండు ఎన్నికల్లో ఆ పార్టీ క్రియాశీలంగా వ్యవహరించడంతో పాటు, ‘మాస్ బేస్‌డ్ పార్టీగా ఎదిగింది. 2014లో టీడీపీ, బీజేపీతో జట్టుకట్టినా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతిచ్చింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగింది. క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన యంత్రాంగం లేనట్టు కనిపించినా ప్రజల్లో, మరీ ముఖ్యంగా యువతలో ఆదరణ పెంచుకుంటూ వచ్చింది. గత ఎన్నికల్లో ఒక సీటు సుమారు ఆరు శాతం ఓట్లు సాధించింది. పవన్ కల్యాణ్ సహా జనసేన నాయకులు, కార్యకర్తలు గత అయిదేళ్లలో ప్రభుత్వ దాష్టీకాన్ని ఎదుర్కొన్నవారే..! వైఎస్సార్సీపీ అరాచకాలపై జనసేన దీటుగా పోరాడింది. టీడీపీ, బీజేపీ మైత్రి కుదర్చడంలో జనసేనాని క్రియాశీల పాత్ర పోషించారు. రెండు ప్రధాన పార్టీల భాగస్వామ్యంతో రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల సమరంలో తలపడ్డారు. ఎలాంటి భేషజాలు లేకుండా పొత్తును పటిష్టం చేయడంలో చంద్రబాబు, పవన్ తమ వంతు కృషి చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులూ ఆదరాభిమానాలు చూపించారు. ఆయన గురించి లోకేశ్ ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినా... 'అన్న' అని ఆత్మీయంగా సంబోధిస్తున్నారు. గన్నవరం, గుడివాడ వైఎస్సార్సీపీ అభ్యర్థులు చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లా డటం, చివరకు ఆయన సతీమణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా రగిలిపోయాయి. ఆ రెండు చోట్లా వైఎస్సార్సీపీ అభ్యర్థుల తీరును ఎండగడుతూ పవన్ చెలరేగి పోవడం, భువనేశ్వరిని సోదరిగా సంభోదిస్తూ ఆమెకు జరిగిన అవమానం తనకు, తన కుటుంబ సభ్యులకు జరిగినట్లుగా భావిస్తున్నానని చెప్పడం టీడీపీ శ్రేణుల మనసులకు హత్తుకుంది. రెండు పార్టీల శ్రేణుల మధ్య టికెట్ల పంపిణీ సందర్భంగా చిన్నపాటి భేదాభిప్రాయాలు తలెత్తినా వాటిని పక్కన పెట్టి విస్తృత లక్ష్యం కోసం ముందుకు కదిలారు.
ఏపీలో కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఫ్యాన్ - టీడీపీ శ్రేణులు సంబరాలు - TDP Celebrations in Andhra Pradesh
టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోకుండా చేసేందుకు వైఎస్సార్సీపీ శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. ప్రభుత్వ అరాచకాలపై పూర్తి స్పష్టత ఉన్న బీజేపీ అగ్రనేతలు పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీట్ల సర్దుబాటు, మ్యానిఫెస్టో, ఉమ్మడి ఎన్నికల ప్రచారం మొదలు అన్ని అంశాల్లోనూ మూడు పార్టీలూ సమన్వయంతో దూసుకెళ్లాయి. మ్యానిఫెస్టోలో భాజపా భాగస్వామి కాకపోవడంపై అపోహలు సృష్టించేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నించినా... బీజేపీ సహా ఇన్చార్జి సిద్ధార్థనాథ్ తిప్పికొట్టారు. 'కేంద్రంలో ఎన్డీయే మ్యానిఫెస్టో విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న రాష్ట్రాల మ్యానిఫెస్టోల్లో భాగస్వామి కావడం లేదు అని వివరంగా చెప్పారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, విధ్వంసకాండపై మొదట చంద్రబాబు, పవన్ కల్యాణ్ కృష్ణార్జునుల్లా సమరశంఖం పూరించారు. రెండు పార్టీల పొత్తు రాత్రికి రాత్రే సాధ్యమవలేదు. అనేక విస్తృత సమావేశాల తర్వాత వారు ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్‌ను ఎదుర్కోవాలంటే కలిసి పోరాడాల్సిందేనని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే గుర్తించారు. ఆ ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ, జనసేన నేతలు క్షేత్రస్థాయిలో అవగాహనతో పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో రెండు ఏపార్టీల మధ్య విస్తృత అవగాహన దిశగా అడుగులు పడ్డాయి. పవన్ కళ్యాణ్‌ను విశాఖ పర్యటనలో పోలీసులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టి, నగరంలో తిరగకుండా ఆయనను అడ్డుకుని, దాష్టీకానికి పాల్పడ్డారు. ఆ తర్వాత విజయవాడలో పవన్ బసచేసిన హోటల్‌కు చంద్రబాబు స్వయంగా వెళ్లి సంఘీభావం ప్రకటించారు. అనంతరం నేతలిద్దరి మధ్య రెండు మూడు సమావేశాలు జరిగాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పవన్ స్నేహహస్తం అందించడం రెండు పార్టీల మైత్రిలో కీలక మలుపు. రాజమహేంద్ర వరం కేంద్ర కారాగారానికి వెళ్లి చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించిన పవన్... బయటకు వస్తూనే ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పోటీ చేస్తాయని ప్రకటించారు.
మూడు పార్టీల అగ్రనాయకులూ... తమ పార్టీ తరఫున అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని పక్కన పెట్టి, ఎన్డీయే విజయమే లక్ష్యంగా ప్రచారం హోరెత్తించారు. చిలకలూరిపే టతో పాటు, రాజమహేంద్రవరం, అనకాపల్లి, కలికిరిల్లో జరిగిన సభలు, విజయవాడ రోడ్డుషోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ అవినీతి, ఇసుక, మద్యం దందాలు, భూముల దోపిడీ వంటి అంశాలపై ఘాటైన విమర్శలు చేశారు. నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలో బీజేపీ అభ్యర్థులెవరూ పోటీలో లేనప్పటికీ చిలకలూరిపేటలో జరిగిన ఎన్డీయే సభకు ప్రధాని హాజరయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం సభకు అమిత్ హాజరై వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధ్వంసక విధానాల్ని తూర్పారబట్టారు. అగ్రనేతలైన నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గొ న్నారు. రేపల్లె, పొన్నూరు వంటి చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా పవన్ అక్కడ ప్రచారం చేశారు. తిరుపతి లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, రైల్వేకోడూరులో ఎన్నికల ప్రచారానికి ఇద్దరూ కలిసే వెళ్లారు.
పంతం నెగ్గించుకున్న చంద్రబాబు - ఆనందోత్సాహాల్లో టీడీపీ శ్రేణులు - CBN Again CM