BRS Leader KTR Participate in Malkajigiri BRS Meeting :రాహుల్ గాంధీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ అరెస్టు అన్యాయమని అంటే రేవంత్ మాత్రం కవిత అరెస్టు కరెక్టే అంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దుయ్యబట్టారు. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే బీజేపీలోకి జంప్ అయ్యే వ్యక్తి సీఎం రేవంత్‌నే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల(Lok Sabha Polls 2024) సన్నాహక సమావేశంలో భాగంగా మేడ్చల్ జిల్లాలోని అలియాబాద్ చౌరస్తాలో జరిగిన సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికంటే ముందు బీజేపీలో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంటులో బీఆర్ఎస్కు కాంగ్రెస్‌తో పోటీ లేదని కేవలం బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉందని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంటు బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలిపిందని తెలిపారు. అందుకే బీఆర్ఎస్కు కచ్చితంగా బీజేపీతోనే పోటీ ఉంటుందని కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే పాత రోజులు తెస్తానని అన్నారు అందుకు అనుగుణంగానే పంట పొలాల్లో బోర్లు కాలుతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పంట నష్టం భారీగా జరిగిందని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ(Loan Waiver) జరిగితే కాంగ్రెస్ ఓటు వేయాలని, డబ్బులు పడని వారు బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు.
KTR Fires on CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పి ఐదు నెలలు గడుస్తున్నా రైతులను పట్టించుకోలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో అబద్ధాల కాంగ్రెస్‌ను నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమం, మంచి పనులు దేశంలోని తెలంగాణను మొదటి స్థానంలో నిలిపాయని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీఆర్ఎస్నే అని కొనియాడారు. కేసీఆర్ ఏం చేశారో తాను చెబుతానని ఈటల రాజేందర్‌కి దమ్ముంటే మోదీ మల్కాజిగిరికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.