Purandeshwari Speech in NDA Legislative Party Meeting Meeting:ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి సోషల్ మీడియా, ద్వారా మరింతగా తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి (BJP State President Purandeshwari) అన్నారు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధిని కావాలని ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమాలు ప్రజలకు గుర్తు చేస్తూ మనం ప్రజలకు ఏం చేస్తున్నామో తెలియజేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. గడిచిన 100 రోజులు ఆర్థిక శాఖ ఏ విధంగా బలోపేతం చేయాలో సీఎం చంద్రబాబు 100 రోజులు నుంచి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.కేంద్రం కూడా రాష్ట్రానికి సహకరించడానికి అన్ని విధాలా ముందుకు వస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేసారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరిగింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి 100 రోజుల పాలనను వివరించేలా కార్యాచరణ రూపొందించారు.