APCC Chief YS Sharmila Election Campaign:ఐదేళ్లు వైసీపీ అధికారం ఇస్తే ఏం చేశారో ఆలోచించి ప్రతి ఒక్కరు ఓటేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన న్యాయయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించారు. పట్టణంలోని ఆర్టీసీ కూడలిలో డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంబేడ్కర్ కూడలి నుంచి భేరివారిమండపం వరకు పర్యటించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. వైసీపీ అరాచకాలు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అవినీతి అక్రమాల పై విరుచకపడ్డారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వసూలు రాజ అని ఆరోపించారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, కబ్జాల రాజా మధుసూధనరెడ్డి అని విమర్శించారు. ఎమ్మెల్యే దెబ్బకు పరిశ్రమలు అన్ని మూసుకొని పోతున్నాయని, మళ్ళీ దోచుకోమని ఆయనకే టికెట్ ఇచ్చారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి కనీసం రాజధాని లేకుండా చేసిందని షర్మిల దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఒకవైపు డబ్బులు ఇస్తూనే, మరోవైపు గుంజుకోవటం ఆయనకే చెల్లిందన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి హోదా కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాల్సిన అవశ్యకత ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి మళ్ళీ కాంగ్రెస్ తోనే సాధ్యమని గుర్తు చేశారు.