ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

వైసీపీ, టీడీపీకి వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది - ఆ పార్టీల ఉచ్చులో పడొద్దు: షర్మిల

AP PCC Chief YS Sharmila Comments: వైసీపీ, టీడీపీకి వేసే ప్రతి ఓటు బీజేపీకి పోతుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజలు ఎవరూ ఆ మూడు పార్టీల ఉచ్చులో పడవద్దని సూచించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.

AP_PCC_Chief_YS_Sharmila_Comments
AP_PCC_Chief_YS_Sharmila_Comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 7:51 PM IST

AP PCC Chief YS Sharmila Comments: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ ప్రధాని అయితే రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ప్రత్యేక హోదా దస్త్రంపైనే తొలి సంతకం పెడతానని రాహుల్ మాటిచ్చారని పేర్కొన్నారు. రాహుల్‌ ప్రధాని కావాలని మొట్టమొదట కోరిందే వైఎస్‌ఆర్‌ అని షర్మిల గుర్తు చేశారు. రాహుల్‌ ప్రధాని కావాలనే వైఎస్‌ తరచుగా అనే వారని షర్మిల వెల్లడించారు. రాహుల్‌ ప్రధాని కావాలని దేశంలోని అనేక మంది ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

నేను స్వతంత్రురాలిని: తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని షర్మిల తెలిపారు. తాను స్వతంత్రురాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర రాజకీయాలలోకి తాను రావడం వలన ఏ పార్టీని నష్టం జరుగుతుందో త్వరలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. అదే విధంగా ఏపీ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్​ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే పార్టీని విలీనం చేశానని, ఏపీ నాకు పుట్టినిల్లు అని, స్వేచ్ఛగా పని చేస్తానని చెప్పారు.

అన్ని నియోజకవర్గాల్లో పోటీ జనవరి 23 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్టు షర్మిల తెలిపారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈనెల 24న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ విజయవాడ వస్తారని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 175 అసెంబ్లీ, అన్ని పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నారు.

జగన్‌రెడ్డి 3 రాజధానులు అని ఒక్కటీ పూర్తి చేయలేదు - రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు : వైఎస్ షర్మిల

రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది: మణిపూర్‌ లాంటి ఘటనలు జరగడం దేశానికి ప్రమాదకరమని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి బీజేపీ ప్రమాదకారి అని అందరికీ తెలుస్తోందని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్‌ ఒక్కటే అతిపెద్ద లౌకిక పార్టీ అని పేర్కొన్నారు. ఏపీకి చేయాల్సిన అన్యాయాన్ని బీజేపీ ఇప్పటికే చేసిందన్న షర్మిల, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిపై కేంద్రం చిన్నచూపు చూసిందని విమర్శించారు. ఇప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంటూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీకి తొత్తులుగా మారాయి: ఉద్యోగాల పేరుతో యువతను, ఆదాయం పేరుతో రైతులను మోసం చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందేదన్న షర్మిల, అనేక అన్యాయాలు చేసిన బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీ, టీడీపీలు భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా మారాయని దుయ్యబట్టారు. బీజేపీతో వైసీపీ, టీడీపీకి కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలంతా బీజేపీ ఎంపీలే అని ఎద్దేవా చేశారు.

స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను వైసీపీ, టీడీపీ తాకట్టు పెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విషయంలోనూ బీజేపీని టీడీపీ, వైసీపీ ఎంపీలు వ్యతిరేకించలేదని షర్మిల గుర్తు చేశారు. మణిపూర్‌ విషయంలోనూ వ్యతిరేకించలేదు అంటే అర్థం ఏమిటి ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ కోసమే టీడీపీ, వైసీపీ పని చేస్తున్నాయని షర్మిల ఆరోపించారు. వైసీపీ, టీడీపీకి వేసే ప్రతి ఓటు బీజేపీకి పోతుందని షర్మిల అన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్​లోని ప్రజలు ఎవరూ ఆ మూడు పార్టీల ఉచ్చులో పడొద్దని సూచించారు. ఏపీలో కాంగ్రెస్ బలపడితేనే ప్రత్యేక హోదా సహా అనేక లాభాలు వస్తాయని షర్మిల పునరుద్ఘాటించారు.

వైఎస్ షర్మిల వాహన కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు - రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు

ABOUT THE AUTHOR

...view details