హైకోర్టులో ప్రభుత్వ ప్రకటనలపై వ్యాజ్యం - సీఎం జగన్కు నోటీసులు AP High Court :వైఎస్సార్సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లలో ప్రజాధనాన్ని వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2019 నుంచి భారీ స్థాయిలో ప్రకటనలకు ఖర్చు చేసిందని, ఇలాంటి చర్య సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అంటూ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ఖర్చు చేసిన సొమ్మును వైఎస్సార్సీపీ నుంచి రాబట్టాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం, ప్రకటనల జారీ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. జగతి పబ్లికేషన్స్ (Jagati Publications)కు ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని అభ్యర్థించారు.
'ఏడాదిలో ప్రకటనలకు రూ.101 కోట్లు సమంజసమా?'
గత ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ప్రకటనలు : పిటిషనర్ తరఫున న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రకటనల ద్వారా ప్రతిపక్షాలను విమర్శించడానికి వీల్లేదన్నారు. అధికార పార్టీని ప్రోత్సహించే విధంగా ప్రకటనలు ఉండకూడదన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిసూ రాష్ట్రప్రభుత్వం రూ కోట్లలో ప్రజల సొమ్ము ఖర్చుచేసి వైఎస్సార్సీపీ ప్రయోజనాలను ప్రోత్సహించేలా ప్రకటనలు ఇచ్చిందన్నారు. రాజకీయ పార్టీల విషయంలో ప్రభుత్వం తటస్థంగా ఉండాలని సుప్రీం చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలు వైఎస్సార్సీపీను ప్రోత్సహించేవిగా, గత ప్రభుత్వాన్ని కించపరిచేవిగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచేవిగా కాకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠను పెంచేవిగా ప్రకటనలు ఉన్నాయన్నారు.
Delhi High Court Issues Notices to AP CM Jagan Couple: పత్రిక కొనడానికి నెలకు రూ.200 ఇస్తున్న ప్రభుత్వం.. ఏపీ సీఎం దంపతులకు దిల్లీ హైకోర్టు కోర్టు నోటీసులు
వివిధ పత్రికల్లో వచ్చిన ప్రభుత్వ ప్రకటనలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందులో గత ప్రభుత్వాన్ని విమర్శించారన్నారు. వైఎస్సార్సీపీ జెండా రంగులను ప్రకటనల్లో వినియోగించారన్నారు. ప్రభుత్వ ప్రకటనల ద్వారా గత ప్రభుత్వాన్ని విమర్శించడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వ పథకాలను పోల్చి చెప్పడం సరికాదన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఫణంగా పెట్టి గత నాలుగున్నరేళ్లుగా వైఎస్సార్సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు ఇచ్చారన్నారు. ఆ సొమ్మును వైఎస్సార్సీపీ నుంచి రాబట్టాలన్నారు.
సమయం కావాలి : ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్ వాదనలు వినిపించారు. పిల్ దాఖలు చేయడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. 2019 తర్వాత ఇచ్చిన ప్రకటనల గురించి మాత్రమే పిటిషనర్ ప్రస్తావించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 6కి వాయిదా వేసింది. ఇక మీదట ఇవ్వబోయే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Delhi High Court Notices to CM Jagan Couple: వాలంటీర్ల ద్వారా సాక్షి కొనుగోలు కేసు.. జగన్, భారతిలకు దిల్లీ హైకోర్టు నోటీసులు