Pawan Kalyan on Allu Arjun Issue :హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో గోటితో పోయే దాన్ని గొడ్టలి దాకా తెచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా చేశారని, ఇది కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డ చనిపోయారన్న బాధ అల్లు అర్జున్‌లో కూడా ఉందని పవన్ అన్నారు. అయితే అల్లు అర్జున్ తరఫున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదని, అంత వివాదం అయి ఉండేది కాదన్నారు. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్ పేర్కొన్నారు. ఈ ఘటనలో రేవతి చనిపోవడం తనను కలచివేసిందని అన్నారు.
అల్లు అర్జున్‌కు చెప్పి ఉండాల్సింది: బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని చెప్పారు. అభిమాని చనిపోతే వెంటనే పరామర్శకు వెళ్లి ఉండాల్సిందని అల్లు అర్జున్ కాకున్నా కనీసం నిర్మాతలైనా వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారని, అల్లు అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. ఈ విషయంలో సంధ్య థియేటర్ సిబ్బంది అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందని పవన్ వ్యాఖ్యానించారు.
'అల్లు ఆర్మీ, అభిమానుల పేరుతో వందల కాల్స్ - చంపేస్తామని బెదిరింపులు'
ఒకవేళ చెప్పినా ఆ అరుపుల్లో వినిపించలేదేమో:ఆయన వెళ్లి కూర్చున్నాక అయినా ఘటన గురించి చెప్పి అర్జున్‌ను తీసుకెళ్లాల్సిందని పవన్ పేర్కొన్నారు. ఒకవేళ అర్జున్‌కి చెప్పి ఉన్నా ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమోనని అభిప్రాయపడ్డారు. ప్రమాద విషయం తెలిసినా అల్లు అర్జున్ అభివాదం చేస్తూ బయటకు వెళ్లారనే ఆరోపణలపైనా పవన్ స్పందించారు. అభిమానులకు అభివాదం చేయకపోతే ఆ నటుడికి పొగరు, బలుపు అని చర్చ పెడతారని చెప్పారు. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు.
అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు:మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సిందని, తన వల్ల చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంటుందన్నారు. సినిమా అంటే టీమ్ అని, అందరి భాగస్వామ్యం ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు.
చిరంజీవి ముసుగు వేసుకుని థియేటర్‌కు వెళ్లేవారు:ఇలాంటి ఘటనల్లో తాను పోలీసులను తప్పుపట్టనని పవన్ వ్యాఖ్యానించారు. పోలీసులు ముందుగా భద్రత గురించి ఆలోచిస్తారని అన్నారు. చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు.