Excise department white paper : నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయని, నేరస్థుడే రాజకీయాలకు అధినేతగా ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు చూశామని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్ర బాబు మాట్లాడుతూ తాము విడుదల చేస్తున్న 7 శ్వేతపత్రాలు గమనిస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కొంతమంది అవసరాలకు తప్పు చేస్తారు, కొంతమంది అత్యాశతో తప్పుచేస్తారు, ఇంకొంతమంది డబ్బుల ఉన్మాదంతో తప్పుచేస్తారన్న చంద్రబాబు.. డబ్బుల ఉన్మాదంతో వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామన్నారు, లిక్కర్ ఔట్‌లెట్స్ తగ్గిస్తామన్నారు కానీ అన్నీ మరిచి చివరికి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆగ్రహించారు. ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారన్నారని గుర్తు చేస్తూ తెలంగాణ, తమిళనాడు, ఒడిశాతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెంచారని తెలిపారు. ధరలు పెంచి మద్యం వినియోగం తగ్గిస్తామన్నా వినియోగం అమాంతం పెరిగిపోయిందని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో ఆదాయం పెరిగి ఏపీలో తగ్గిందని, తగ్గిన ఆదాయం వైఎస్సార్సీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని చెప్పారు.
లెక్కలు తారుమారు చేసేందుకు వెబ్సైట్ నుంచి లిక్కర్ డేటా తొలగింపు: అచ్చెన్నాయుడు
దేశంలో దొరికే లిక్కర్ ఏపీలో దొరకలేదు, పెద్ద కంపెనీలు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారని, చెల్లింపులు ఆలస్యం చేయడం, ఆర్డర్ ఇవ్వకుండా వేధించారని మండిపడ్డారు. ఇష్టం లేని బ్రాండ్లన్నీ షాపుల్లో ఉంచి వాళ్లు ఏ కంపెనీ బ్రాండ్లు పెడితే అవే తాగే పరిస్థితి తెచ్చారని తెలిపారు. మద్యం అనేది ఒక వ్యసనం, పేదవాడు శారీరకంగా కష్టపడి ఆ బాధలు మరచిపోయేందుకు తాగుతాడని చెప్తూ అలవాటును బలహీనంగా చేసుకుని దోచుకున్నారని ధ్వజమెత్తారు. పేదవాడికి అమ్మే లిక్కర్‌పై విపరీతంగా ధరలు పెంచి సంపాదించింది తాగడానికే ఖర్చు పెట్టించారని, ఇక పేదలు ఏం తినాలని ప్రశ్నించారు.