Pratidhwani : హైదరాబాద్‌లో ఆక్రమణదారులను హైడ్రా హడలెత్తిస్తోంది. చిక్కిపోతున్న చెరువులకు చిరు దీపంలా కొత్త ఊపిరులు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఒత్తిడులకు లొంగకుండా, చెరువులు, కుంటల్ని చెర విడిపించడమే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే భారీ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఆక్రమణల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ అక్రమార్కుల గండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
హైడ్రా ఏ రోజు ఎక్కడ కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో గుబులు పుడుతోంది. కొద్దిపాటి సిబ్బంది, అంతంతమాత్రంగానే ఉన్న యంత్రాలతో భాగ్యనగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ హడలెత్తిస్తోంది. ప్రగతినగర్ ఎర్రకుంట, మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో భారీ నిర్మాణాలు నేలకూల్చేదాక పట్టువీడటం లేదు. ఇప్పుడు ఈ ఆక్రమణల తొలగింపు కోసం ఆ విభాగం దూకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
అసలు చెరువుల పరిస్థితేంటి? : ఒకప్పుడు చరిత్రకు సాక్ష్యంగా, ప్రజల జీవనోపాధికి అండగా నిలిచిన చెరువుల్ని ఇకనైనా కాపాడుకోవడానికి మాకూ ఓ హైడ్రా తరహా విభాగం కావాలంటూ పౌర సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. చెరువులు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. మరి హైదరాబాద్ జంట నగరాల్లో అసలు చెరువుల పరిస్థితేంటి? ఒకప్పుడు చెరువుల నగరంగా ఉన్న భాగ్యనగరంలో ఇప్పుడెన్ని మిగిలాయి? ఏ పరిస్థితుల్లో ఉన్నాయి?