Prathidwani :ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిరోజులుగా వరుసగా కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ శాఖలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు పోలవరం, అమరావతి, విద్యుత్‌శాఖ, గనుల శాఖలపై శ్వేతపత్రాలు ప్రజల ముందుంచారు. వాటిల్లో ఏం తేలింది? జగన్ సీఎంగా దిగిపోయే సమయానికి రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? తక్షణం వేటిమీద దృష్టిపెట్టాలి? రాష్ట్రాన్ని పునర్మించటానికి ఏం చేయబోతున్నారు? అనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో సాంఘీక సంక్షేమ శాఖ మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, జనసేన సీనియర్ నాయకులు గాదె వెంకటేశ్వర్లు, తూ.గో జిల్లా అనపర్తి నుంచి ఎన్నికైన BJP ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని, కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ పాల్పడ్డారని అన్నారు.
విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారన్న చంద్రబాబు, ఇళ్ల నిర్మాణం పేరుతో వైఎస్సార్సీపీ నేతలు దందా చేశారని దుయ్యబట్టారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారని అన్నారు. అసైన్డ్ భూములను ఇతరులకు కేటాయించడం నేరమన్న చంద్రబాబు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం అడవులను కూడా ధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు.