CM Chandrababu Naidu Meeting With Bankers : ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులు, గృహోపకరణాల కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్, జిల్లా కలెక్టర్ సృజనలతో కలిసి సమీక్షించారు. భారీ వరదల వల్ల విపత్తు వచ్చిందని, ఈ సమయంలో ఆదుకోవడం ధర్మమని చంద్రబాబు వారికి సూచించారు. ఎలక్ట్రానిక్, గృహోపకరణాల ఉత్పత్తుల సంస్థలకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారం అందిస్తున్నా, వారు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంపెనీలపై సీఎం ఆగ్రహం : ఇలానే కొనసాగితే ఇక ముందు ప్రభుత్వం నుంచి సహకారం ఉండదని, సంస్థలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో మానవతా ధృక్పథంలో వ్యవహరించాలని సూచించారు. మరో రెండు రోజుల్లో పరిస్థితి సమీక్షిస్తానని అప్పటికి మొతం పరిష్కారం కావాలని తేల్చి చెప్పారు. గృహోపకరణాలపై 50శాతం సబ్సిడీ, లేబర్ ఛార్జీలపై పూర్తిగా రాయితీ ఇస్తామని కంపెనీలు మొదట హామీ ఇచ్చినా, ప్రస్తుతం అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాల్‌సెంటర్‌లు, కస్టమర్ కేర్‌సెంటర్ల నుంచి స్పందన లేదని పలువురు వరద బాధితులు అధికారుల దృష్టికి తేవడంతో సీఎం ఆయా కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారంలో మరో సమీక్ష : బీమా కంపెనీలు వారం రోజుల్లో క్లెయిమ్‌లు పరిష్కరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినదంతా చేస్తున్నాయన్నారు. బీమా కంపెనీలు, బ్యాంకులు వినూత్న ఆలోచనలతో ప్రజలకు సహాయం చేసి సంస్థలపై విశ్వసనీయత పెరిగేలా చేయాలని సూచించారు. 110 ఫైర్ ఇంజిన్లతో ఇళ్లను శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి నష్టాలకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లు సత్వర పరిష్కారానికి పెసిలిటేటర్ సెంటర్ ఏర్పాటు చేశామని, వారికి న్యాయమైన సెటిల్‌మెంట్ చేయాల్సి ఉందని తేల్చిచెప్పారు. ప్రతి క్లెయిమ్‌ను న్యాయబద్దంగా పరిష్కారం చూపాలన్నారు. నష్టగణన ముదింపు సక్రమంగా జరగాలని ఆదేశించారు. దాదాపు 9వేల క్లెయిమ్‌లు వచ్చాయని, అన్నింటిని పరిష్కరించాలన్నారు. మళ్లీ వారంలో సమీక్ష జరుపుతానని, అప్పటికి ఒక్కటి కూడా మిగలకూడదని స్పష్టం చేశారు. దాదాపు 95 శాతం బీమా క్లెయిమ్‌లు అందుతాయని కంపెనీల ప్రతినిధులు సీఎంకు సమాధానం ఇచ్చారు.
ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకూడదు : బ్యాంకర్లు అన్ని రకాల రుణాల రీషెడ్యూల్ చేయడం, గడువు కాలం పెంచడం లాంటి ప్రయోజనాలు చేకూర్చాలని చంద్రబాబు సూచించారు. అవసరమైన వారికి మళ్లీ పంట రుణాలు అందించాలన్నారు. బ్యాంకర్లు జాప్యం చేయవద్దని, మీకు మార్గదర్శకాలు లేకపోతే ఎలాంటి ఆదేశాలు కావాలో చెప్పి ప్రతిపాదనలు పంపాలన్నారు. కేంద్రం, ఆయా సంస్థలు, ఆర్‌బీఐతోనూ చర్చించి ఆదేశాలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఉదారంగా ఇచ్చి ఆదుకోవాలన్నారు.
వరదల వల్ల ఉపాధి కోల్పోయిన వారిని గుర్తించి ప్రోత్సహించి, తిరిగి వాళ్ల కాళ్లమీద నిలబడి నలుగురుకు ఉపాధి కల్పించేలా చూడాలన్నారు. సంతృప్తి స్థాయిలో కంపెనీలు, సంస్థలు సేవలు అందించారా లేదా అనేది ఐవీఆర్‌ఎస్, ఫోన్ కాల్స్ ద్వారా డాటా తెప్పించుకుంటానన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకూడదని హెచ్చరించారు. బ్యాంకులు కొల్లేటరల్ సెక్యూరిటీ లాంటి నిబంధనలు లేకుండా చూడాలని సూచించారు. అవసరమైనంత మేరకు సాంకేతిక నిపుణులను పెంచుకోవాలని, హైదరాబాద్, చెన్నై నుంచి రప్పించాలన్నారు.