Pratidhwani on Suicide Prevention Day 2024 : ఉన్నది ఒక్కటే జీవితం. కానీ ఒక్కక్షణం ఒకే ఒక్కక్షణంలో తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు ఎన్నో జీవితాల్ని తలకిందులు చేస్తున్నాయి. అప్పటి వరకు, ఆ క్షణం ముందు వరకు మనతో, మన మధ్యనే ఉంటున్న వారు శాశ్వతంగా మన మధ్య నుంచి దూరమైపోయారనే మాటే కుటుంబాల్లో పిడుగుపాటవుతోంది. దేశంలో గంటకు 20, రోజుకు 468మందిగా నమోదు అవుతున్న బలవనర్మణాలు కన్నీటి చారికల తడి ఆరనివ్వడం లేదు.
వాటి గాయాలు మానడం లేదు. బాధిత కుటుంబాలు కుదుట పడడం లేదు. కానీ ఎందుకీ విషాదం? ఎవరో ట్రోల్ చేశారనో, వేరేవరో ఏదో అన్నారనో, సమస్యలు చుట్టుముట్టాయనో ప్రాణాల్ని బలిపీఠంపై పెట్టడం ఎంతవరకు కరెక్ట్? బ్రతకడం కష్టంగా, ఊపిరే భారంగా అనిపించే క్షణాల్ని ఎలా అధిగమించాలి? ఆత్మహత్యల సమస్య రోజురోజుకీ ఎందుకు ఇంత తీవ్రమవుతోంది? ప్రత్యేకించి ఒక రోజును ప్రకటించి మరీ ఎందుకు అవగాహన కల్పించాల్సి వస్తోంది?
చాలాసార్లు బాధిత కుటుంబాలు మాతో ఒక్క మాటైనా అనలేదు, ముందువరకు బానే ఉన్నారని వాపోతుంటారు. ఇంతసైలెంట్‌గా, ఇంత అకస్మాత్తుగా ఆత్మహత్య వరకు ఎలా వెళ్తున్నారు? పెరుగుతున్న ఆత్మహత్యల్లోనూ మగవారి కంటే మహిళలే అధికం అంటున్నాయి గణాంకాలు. కౌన్సింగ్ కోసం వచ్చే వారితో మాట్లాడుతున్నప్పుడు మానసిక నిపుణులు గమనిస్తోన్న అంశాలు ఏమిటి? నిజానికి ప్రతిఒక్కరు ఎన్నో కలలతో జీవితాన్ని ప్రారంభిస్తారు. ఎన్నో మెట్లు ఎక్కుతూ అక్కడి వరకు వస్తారు. కానీ చిన్నచిన్న కుదుపుల్ని ఎందుకు తట్టుకోలేక పోతున్నారు?
పెరుగుతున్న బలవన్మరణాల్లో ఈ మధ్య కలవరపెడుతున్న మరొకఅంశం వారితో పాటు పిల్లల్ని చంపుకోవడం, చంపేస్తుండడం ఎందుకీ విపరీత ధోరణులు? సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో అసలు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడు, ఎలా ప్రవేశిస్తుంది? దానిని అడ్డుకోలేమా? ఈ విషయంలో నిపుణులేం చెబుతున్నారు? కుటుంబంలో ఎవరైనా కుంగుబాటు ప్రభావం, ఆత్మహత్య ఆలోచనల్లో ఉన్నారని తెలుసుకోవడం ఎలా? వారి మాటలు, ప్రవర్తనలో ఏమైనా అలాంటి సంకేతాలు గమనించగలమా?
Suicide Prevention Day 2024 : మానసిక ఆరోగ్య పరిరక్షణకు పాటించాల్సిన సూత్రాలేంటి? డీలా పడినవారిని గుర్తించినా తిరిగి సాధారణ స్థితికి తీసుకుని రావడం ఎలా? ఈ విషయంలో వైద్యుల్ని ఎప్పుడు సంప్రదించాలి? అనుకోని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకున్న వారి గురించే అంతా ఆలోచిస్తారు. వాళ్ల కుటుంబ సభ్యులకు ఎలాంటి కౌన్సిలింగ్ లేదా భరోసా అవసరం? ఈరోజు (సెప్టెంబర్-10) ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో మానసిక నిపుణురాలు డా.మండాది గౌరీదేవి, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు ఎన్.ఎన్.రాజు పాల్గొన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం.