Prathidwani Debate: కూటమి చేతిలో ఓటమి ఖాయం అనే భయం వైసీపీను ఆవహించిందా? ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రలోభాల పర్వం అందుకేనా? వలంటీర్లను శిఖండుల్లా ఎందుకు వాడుతున్నట్టు? అడ్డదారిలో గెలవటం కోసం కాదా? ఇంటింటికీ తాయిలాలు పంచుతూ ఓట్ల కొనుగోలు ఎందుకు చేస్తున్నట్టు? జగన్‌పై నమ్మకం లేదా? జనాగ్రహం ఎగిసిపడుతోందని గ్రహించారా? కుక్కర్లు పంచినంత మాత్రాన జనం కుక్కిన పేనుల్లా పడుంటారా? ‘ఓటు అనే ఆయుధంతో పోరాడుతావో, నోటు అనే వ్యసనంతో మరణిస్తావో’ తేల్చుకో అని ఓ కవి అన్నట్టుగా ఇప్పుడు ప్రజలు తమ ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటారా? ఐదేళ్లుగా చేసిన అరాచకాలను అంత త్వరగా మరిచిపోగలరా? ఇదీ నేటి ప్రతిధ్వని కార్యక్రమం. నేటి చర్చలో రాజకీయ విశ్లేషకులు ఎ.రాజేష్, వాలంటీర్ల వ్యవస్థపై పిటిషనర్ షేక్ అబూబకర్ సిద్దిఖ్లు పాల్గొన్నారు.
ఏపీలో ప్రలోభాలకు పాల్పడుతున్నారని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సైతం అన్నారు. కేవలం డబ్బులు మాత్రమే కాకుండా ప్రెషర్ కుక్కర్లు వంటి గృహోపకరణాలు సైతం పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ రాలేదు అనే సాంకేతిక కారణంతో చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. అయితే ఇది సరైనది కాదన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.
వైసీపీ మంత్రులు తమ శాఖలకు ఏం న్యాయం చేశారు? - వారికి ఎన్ని మార్కులు వేయవచ్చు?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిన వ్యాఖ్యలు అక్షర సత్యమని రాజకీయ విశ్లేషకులు ఎ.రాజేష్ అన్నారు. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నారని చెప్పారు. దొంగ ఓట్లను చేర్చడం, అర్హులైన వారిని జాబితా నుంచి తొలగించడం చేస్తున్నారన్నారు.