Prathidwani :2019లో జగన్ సీఎం అయిన దగ్గర్నుంచి పేదలు ఉసూరుమంటున్నారు. బటన్ నొక్కిన దాని కంటే ప్రభుత్వం బొక్కిందే ఎక్కువ. ఇచ్చిన దానికంటే లాక్కుందే ఎక్కువ. గత ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే ఆ వ్యవస్థను నాశనం చేశారు. ఫలితంగా రాష్ట్రంలో భవన నిర్మాణాలు నిలిచిపోయి లక్షలమంది కూలీలు అల్లాడిపోయారు. చిన్న పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమలు రాక, వ్యాపారాలు లేక, రహదారులు కానరాక బడుగు జీవులు నానాకష్టాలు పడుతున్నారు.
అడ్డా కూలీలు, కార్పెంటర్లు, చిరు వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లూ అందరూ లబోదిబో అంటున్నారు. ఉన్న ఊరు వదిలి వలసలు పోతున్నారు. జగన్‌కు ఓటేసిన వారంతా చెంపలేసుకుంటున్నారు. ఐదేళ్ల జగన్ పాలన పేదలకు శాపంగా ఎలా మారిందో నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. ఈ చర్చలో సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య పాల్గొన్నారు.
CM Jagan Neglect Building Construction Labours in AP : సీఎం జగన్ రాజధానుల పేరిట ఆడిన మూడు ముక్కలాటలో స్థిరాస్తి రంగం కుదేలైంది. ఆ ఆటలో భవన నిర్మాణ కార్మికులు సమిధలయ్యారు. గత ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడం మొదలు కార్మికుల జీవనోపాధిని నాశనం చేయడమే లక్ష్యమన్నట్లుగా జగన్ పనిచేశారు. నూతన ఇసుక విధానం పేరిట రీచ్‌లను మూసివేసి ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. దీంతో ఒక్కసారిగా నిర్మాణాలు ఆగిపోయి కార్మికులకు నెలల తరబడి ఉపాధి కరవైంది. ఒకటి, రెండు రోజులు పనులు దొరక్కపోతేనే పూట గడవని కుటుంబాలు కొన్ని నెలలపాటు అల్లాడిపోయాయి. ఇంటి అద్దెలు, వైద్యం, పిల్లల ఫీజులు, రోజువారీ ఖర్చులు భారంగా మారి అప్పులపాలయ్యారు. అంతలోనే వచ్చిన కరోనాతో వారి పరిస్థితి మరింత దిగజారింది.
రాజధానుల పేరిట జగన్ మూడు ముక్కలాట - బలైన భవన నిర్మాణ కార్మికులు - CM Jagan Neglect Labours