Prathidhwani : అసలే వ్యాధుల కాలం ! ఆ పై వరదల బీభత్సం! తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఇదే. నిన్నామొన్నటి వరకు వణికించిన డెంగీ, విషజ్వరాల కష్టం చాలదన్నట్లు పీకల్లోతు నీటిలో మునిగి పోయాయి జనావాసాలు. రోజుల తరబడి నీళ్లల్లోనే నానుతున్నాయి. ఆ వరదలు అవి మోసుకు వచ్చిన బురద ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి. సాధారణంగానే ఇలాంటి సందర్భాల్లో వాతావరణం మారటమే కాదు, కలుషితమయ్యే నీరు, ముసురుకొచ్చే దోమల దండుతో దాడి చేసే జబ్బులు చాలా ఎక్కువ. ఈ పరిస్థితులతో ఇప్పటికే ఉన్న కొన్ని జబ్బులూ తీవ్రం కావొచ్చు. ఈ విపత్కర పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మరి, వ్యాధులు ప్రబలే ఈ సమయంలో మన ఆరోగ్యానికి మనమే రక్షగా ఉండాలి. మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. చాలా వరకు మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డా. ఎంవీ రావు, జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. నాగూర్‌బాషా.
అసలే వర్షాకాలం అనుకుంటే వరదలు ముంచెత్తాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రజారోగ్యానికి ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఏమిటి? కొత్తగా అనారోగ్యాలు రావడం ఒకటైతే ఇప్పటికే వివిధరకాల వ్యాధులు, జబ్బులతో ఉన్నవారు ఈ వరద పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు? మనకి సంక్రమించే వ్యాధుల్లో నీటి కారణంగా వచ్చే జబ్బులు ఏంటి? తాగే నీటి విషయంలో జాగ్రత్త తీసుకోవటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇలాంటి సందర్భాల్లో వచ్చే విషజ్వరాలు సాధారణ జ్వరాలకు తేడా ఏంటి? శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం అప్రమత్తం కావాలి? మరీ ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఉన్నవాళ్లు ఆహారం పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దొరికింది తినాల్సిన పరిస్థితుల్లో ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి?