Left Handed People Facts : ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరు ఎడమ చేతి వాటం ఉన్నవారని ఒక అంచనా. అయితే, మన చుట్టూ దాదాపు అందరూ ఎడమ చేతి వాటం ఉన్నవారు ఉండడం మనం గమనించవచ్చు. ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఉన్నవారు ఇతరులతో సంభాషించడం లేదా నలుగురితో కలవడంలో ముందుంటారని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎడమ చేతి వాటం ఉన్నవారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
చేతివాటం, మెదడులోని భాషాప్రాంతాలు వంటివాటిపై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం పరిశోధన చేపట్టింది. న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం మేరకు, ఎడమచేతి వాటం ఉన్నవారిలో మెదడు ఎడమ, కుడివైపులా ఉన్న భాషాప్రాంతాలు ఒకదానితో ఒకటి మరింత సమన్వయంతో సంభాషించుకుంటాయట. దీనివల్ల ఇటువంటివాళ్లకు మౌఖిక పనులు చేసేటప్పుడు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉందని కనుగొన్నారు.
కొందరికి ఎడమచేతి వాటం ఉంటుందెందుకు?
ఎడమ చేతి వాటం ఉండడానికి గల కారణాలను హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ ఈవీ సుబ్బారావు తెలియజేస్తున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే- 'కొంతమంది ఎడమ చేతితో రాస్తారు. బ్యాట్మింటన్‌లాంటి ఆటల్ని ఎడమచేత్తో ఆడతారు. ఇలా అందరిలాగా కుడిచేత్తో కాకుండా ఎడమ చేతి వాటం ప్రదర్శించడానికి జన్యువులు, పరిసరాల ప్రభావం వంటివి కారణాలు. సహజంగా స్త్రీలకన్నా, పురుషుల్లో ఎడమచేతి వాటం వారు 50శాతం ఎక్కువ. మామూలుగా జన్మించిన శిశువులకన్నా కవల పిల్లల్లో ఈ లక్షణం 17శాతం అధికం. ఎడమచేతి వాటం సంక్రమించడంలో మెదడు ముఖ్య పాత్ర వహిస్తుంది'
మనలో ఎక్కువమందికి కుడిచేతి వాటం ఉన్నట్లే మనం మాట్లాడే మాటల్ని కూడా మెదడులోని కుడి అర్ధభాగం నియంత్రిస్తుంది. అదే లెఫ్ట్ హ్యాండ్ వారిలో ఈ విషయంలో వ్యతిరేకంగా ఉంటుంది. ఇక జన్యువుల విషయానికి వస్తే ఈ ఎడమ చేతివాటం వారి విషయంలో కాస్త క్లిష్టతరంగా ఉంటుంది. పేరెంట్స్ ఇద్దరూ ఎడమచేతివాటం వారైనా, వారి సంతానం కూడా ఎడమచేతివాటం కలిగి ఉండే ఛాన్స్ 26శాతం ఉంటుంది. ఎడమచేతి వాటం కలిగి ఉండటానికి కారణం అయిన LRRTM1 జన్యువు తండ్రి నుంచి శిశువుకి సంక్రమిస్తే ఈ లక్షణం వస్తుంది. ఈ లక్షణం శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి శరీరంలో ఉండే టెస్టోస్టీరాన్ అనే హార్మోన్ స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుందని ప్రొఫెసర్ ఈవీ సుబ్బారావు తెలిపారు.