Medicine for diabetes: నిత్యం జనం ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు సులువైన పద్ధతిలో వైద్యం అందుబాటులోకి వస్తే అంతకన్నా ఆనందం ఇంకొకటి ఉండదు. అది కూడా ఎలాంటి ప్రతికూల ఫలితాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఇవ్వని వైద్యమైతే ఇంకా సంతోషం. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎమ్మెస్సీలో బయోటెక్నాలజీ చదువుతున్న కొందరు విద్యార్థినులు అలాంటి ప్రయత్నమే చేశారు. కొన్ని రకాల రోగాలకు ఇప్పుడు వాడుతున్న మందులకు బదులు ప్రత్యామ్నాయ మందులను తయారు చేసి పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు. వాటి వాడకానికి ప్రభుత్వ అనుమతి కోసం కూడా పంపించారు. అనుమతి లభిస్తే కొన్ని రకాల రోగాలకు వైద్యం సులువవుతుంది.
డయాబెటీస్ రోగులు డ్రై ఫ్రూట్స్ తింటున్నారా?
మొక్కల ఇన్సులిన్‌కు పరిశోధన : మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కొందరు రోజూ ఇంజక్షన్ రూపంలో ఇన్సులిన్ తీసుకోవడం మనం చూస్తుంటాం. ఇది వ్యయ ప్రయాసతో కూడినది కావడంతో పాటు డోసు ఎక్కువైతే ప్రమాదమే. కొన్ని రకాల మొక్కలను ఎలాంటి ఎరువులు, రసాయనాలు లేకుండా పండించి వాటిలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఎక్కించడం ద్వారా వాటిలో ఇన్సులిన్ వృద్ధి చేయవచ్చని బయోటెక్నాలజీ విద్యార్థినులు బాల రోహిత సుందరం, లేఖన ఆకుల గుర్తించారు. ఆయా కూరగాయలు, పండ్లు నోటి ద్వారా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అందుతుంది. ఆ మొక్కలు పెంచేందుకు కాలస్ కల్చర్ అనే పరికరాన్ని కూడా విద్యార్థినులు తయారు చేశారు.
అండాశయంలో బుడగల నివారణ :మహిళలకు అండాశయంలో ఏర్పడే బుడగలు (పొలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్) వంటి వాటి నివారణ సాధ్యమని ఇదే కళాశాలకు చెందిన మైథిలి ఆకెళ్ల, లేఖన ఆకుల, బాల రోహిత సుందరం భావించారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం హార్మోన్ల హెచ్చు తగ్గులే కారణంగా భావించి వాటిని స్థిరీకరించే గుణం రావి ఆకులో ఉందని గుర్తించారు. దీంతో రావి ఆకును పచ్చడిలా చేసి అందులో నుంచి వచ్చే నీటి (పసర) ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చనది వీరి ఆలోచన. దీనికోసం కూడా వీరు పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.