Valentines Day 2025 :ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమను వ్యక్తపరిచేందుకు, ప్రేమను ఆస్వాదించడానికి వచ్చిన ఓ సదవకాశం మాత్రమే. మిగతా దినోత్సవాల మాదిరిగానే దీనిని కూడా చూడాలే తప్ప, 'ఇదే అవకాశం పోతే మళ్లీ తిరిగిరాదు' అన్నట్లు వ్యవహరించకూడదు. ఫిబ్రవరి 14 మళ్లీ మళ్లీ వస్తుందని గుర్తుంచుకోవాలి. యువతీ యువకులు, భాగస్వాములు తమ ప్రేమను పంచుకునేందుకు వచ్చిన అవకాశం, సందర్భం మాత్రమే. అంతే తప్ప సెలబ్రేషన్స్ పేరిట సభ్య సమాజానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం కాదు. బహిరంగ ప్రదేశాలు, ఆరుబయట, పార్కుల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయడం కాదు. 'ప్రేమికుల దినోత్సవం! మా ఇష్టం' అంటూ చెలరేగిపోతే తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాల్సిందే. తామేదో ఘనత సాధించినట్లుగా కొంత మంది ప్రేమికులు రెచ్చిపోతున్నారు. బైక్‌లపై వెళ్తూ స్టంట్లు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో రీల్స్ పోస్టు చేస్తున్నారు.
గులాబీలతో మొదలయ్యే ప్రేమ - ఎవరికి ఏ రంగు గులాబీ ఇవ్వాలో తెలుసా?
'స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్' అని వినే ఉంటారు. ఫిబ్రవరి 14న మరచిపోని మధురానుభూతులు మిగుల్చుకునే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు గానీ, ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన అవసరం లేదని తెలుసుకోంది. బైక్ రైడింగ్, విన్యాసాలు సరదాగా అనిపించొచ్చు కానీ, ఏదైనా ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్, కార్ రేసింగ్‌లు, స్టంట్లు పెరిగిపోయాయి. కొంత మంది యువకులు పోలీసుల కళ్లుగప్పి వీటిని నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా తాజాగా వాలెంటైన్స్ డే పురస్కరించుకుని లవ్‌బర్డ్స్ సైతం రెచ్చిపోతున్నారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకుండా అతి వేగంతో బైక్ నడుపుతూ స్టంట్స్ చేస్తున్నారు.