Pakistani Man Conspired To Assassinate Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటుగా కొందరు రాజకీయ నాయకులను హత్య చేసేందుకు ఓ పాకిస్థానీ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారు. నిందితుడికి ఇరాన్‌తో బలమైన సంబంధాలున్నట్లు గుర్తించినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్‌వ్రే వెల్లడించారు. దీనిని ఇరాన్ చేయించే కిరాయి హత్య కుట్రగా క్రిస్టఫర్‌వ్రే పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన 46 ఏళ్ల ఆసీఫ్ మర్చెంట్ అమెరికన్లను చంపేందుకు కిరాయి హంతకుడిని నియమించుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందని తెలిపారు.
నిందితుడి అరెస్ట్
పాకిస్థాన్‌కు చెందిన ఆసీఫ్ మర్చెంట్‌ను అమెరికా అధికారులు న్యూయార్క్‌లో అరెస్టు చేశారు. అతడి టార్గెట్‌లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఆసీఫ్ మర్చెంట్ ఏప్రిల్‌లో పాకిస్థాన్ నుంచి అమెరికా వచ్చినట్లు ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. గతంలో ఇతడు ఇరాన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఆసీఫ్ కుటుంబం అక్కడే ఉందని పేర్కొన్నారు. అమెరికాకు చేరుకోగానే కిరాయి హంతకులను ఏర్పాటుచేయడంలో సహకరిస్తాడని ఓ వ్యక్తితో కుట్రపై చర్చించాడు. కానీ, సదరు వ్యక్తే పోలీసులకు సమాచారం చేరవేశారు. వాస్తవానికి ఆ కిరాయి హంతకుడి రూపంలో ఉన్న వ్యక్తి అండర్‌కవర్ అధికారిగా సీఎన్‌ఎన్ వెల్లడించింది.
ఒప్పందంలో భాగంగా అండర్‌కవర్ అధికారి ఆసీఫ్‌ను జూన్‌లో కొందరు వ్యక్తుల వద్దకు తీసుకెళ్లాడు. వారితో అతడు మాట్లాడుతూ న్యూయార్క్‌లో తనకు మూడు పనులు చేయాలని, కొన్ని పత్రాలు, డ్రైవ్‌లను దొంగిలించడం, రాజకీయ ప్రదర్శనల్లో పాల్గొనడం, హత్యలు చేయాలని వారిని కోరాడు. ఏదో ఒకసారి డీల్‌తో ఇది ముగియదని, పలుమార్లు అవసరం పడవచ్చని కూడా మర్చెంట్ ఆ కిరాయి వ్యక్తికి చెప్పాడు. హత్యలు మొదలుకావడానికి ముందే తాను అమెరికాను వీడతానని ఆసీఫ్ మర్చెంట్ వెల్లడించాడు. ఆ తర్వాత భద్రతలో ఉండే వ్యక్తులను చంపడం గురించి వారికి వివరించాడు.