Russia Ukraine War UN Resolution :ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలను రూపుమాపి, యుద్ధానికి శాంతియుత పరిష్కారాన్ని చూపించాలని, బందీలను సత్వరం విడుదల చేయాలని కోరుతా ఐరాస తీర్మానించింది. తమ భూభాగం నుంచి రష్యా సైన్యం వెంటనే వైదొలగాలనే డిమాండ్‌తో ఉక్రెయిన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా, సర్వ ప్రతినిధి సభ ఆమోదించింది. సోమవారం జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానికి అనుకూలంగా 93, వ్యతిరేకంగా అమెరికాతో సహా 18 దేశాలు ఓటేశాయి. భారత్ సహా మరో 65 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
అమెరికా ప్రయత్నం విఫలం
ఈ తీర్మానంలో రష్యా దురాక్రమణ అనేది ప్రస్తావించకుండా చూడాలని అమెరికా చేసిన ప్రయత్నాన్ని ఐరాస తిరస్కరించింది. తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అగ్రరాజ్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు. యుద్ధఖైదీల మార్పిడి, బందీల విడుదల, ఇంధన సదుపాయాలపై దాడుల నిలిపివేత వంటి అంశాలను ఉక్రెయిన్ ఈ తీర్మానంలో ప్రస్తావించింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి కుదిరే ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్‌లో ఐరోపా శాంతి పరిరక్షకుల్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరిస్తారని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.
ఉక్రెయిన్‌లో విదేశీనేతలు
మరోవైపు యుద్ధం మొదలై మూడేళ్లు పూర్తయిన వేళ ఉక్రెయిన్‌కు బాసటగా ఐరోపా దేశాలు, కెనడాకు చెందిన దాదాపు డజను మంది నేతలు సోమవారం కీవ్‌లో అడుగుపెట్టారు. వీరిలో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వొన్‌డెర్ లెయెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తదితరులు ఉన్నారు. ఉక్రెయిన్ అస్తిత్వం కోసం జరుగుతున్న పోరులో ఐరోపా భవితవ్యం కూడా ముడిపడి ఉందన్నారు. ఉక్రెయిన్ ప్రధాన అంశంగా 27 మంది ఈయూ నేతలతో మార్చి 6న బ్రసెల్స్‌లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నామని కోస్టా తెలిపారు. ఉక్రెయిన్‌తోపాటు ఐరోపా భద్రతపై చర్చించుకోవాల్సి ఉందని చెప్పారు. అక్రమ యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంతకాలం తాము సైనిక, మానవతాపరమైన సాయాన్ని ఉక్రెయిన్‌కు అందిస్తామని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టీన్‌మీయెర్ ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఐరోపాలో శాంతి, స్వేచ్ఛ తమకు ముఖ్యమన్నారు. మరికొన్ని దేశాల అధినేతలు కూడా ఉక్రెయిన్‌కు దన్నుగా నిలిచారు.
ఉక్రెయిన్‌కు వచ్చిన విదేశీ నేతలు (Associated Press) 'ఉక్రెయిన్ లేకుండా శాంతి ఒప్పందం ఉండదు'
రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గే ర్యబ్‌కోవ్ మాస్కోలో ప్రభుత్వ అధికార వార్తాసంస్థతో మాట్లాడుతూ అమెరికా- రష్యా ద్వైపాక్షిక చర్చలు ఈ వారాంతంలో కొనసాగుతాయని చెప్పారు. ఉక్రెయిన్ గానీ, ఐరోపా గానీ లేకుండా అమెరికా ఎలాంటి శాంతి ఒప్పందాన్ని చేసుకోజాలదని ఈయూ ఉన్నతస్థాయి దౌత్యవేత్త కజా కల్లాస్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యుద్ధాన్ని ముగించడానికి అమెరికాతో కలిసి రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న ప్రయత్నాలు హర్షించదగినవని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కొనియాడారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి చక్కని కృషి జరుగుతోందని చెప్పారు. ఘర్షణకు శాంతియుత పరిష్కారం లభించడానికి రష్యా-అమెరికాలకు ఎలాంటి మద్దతు కావాలన్నా అందిస్తామన్నారు.