తెలంగాణ

telangana

బ్రిటన్‌లో హిందూ ఓటర్లపై పార్టీల ఫోకస్​- ఆలయాలను సందర్శిస్తూ! - UK General Elections

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 10:32 PM IST

Britain Election 2024 Hindu Voters : బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ అక్కడి హిందూ ఓటర్లపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. అందులో భాగంగా కన్జర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్ హిందూ దేవాలయాలను, లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌డా కింగ్స్‌బరీలో ఉన్న స్వామినారాయణ్‌ ఆలయాన్ని సందర్శించారు.

Britain Election 2024
Britain Election 2024 (Associated Press)

Britain Election 2024 Hindu Voters :బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు విస్తృత ప్రచారంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడ హిందూ ఓటర్లపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి, కన్జర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌, లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌లు అక్కడ హిందూ దేవాలయాలను సందర్శించారు. తమ విధానాలతో ఆ వర్గానికి చెందిన ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

స్వామినారాయణ్ ఆలయంలో సునాక్ దంపతులు (Associated Press)

స్వామినారాయణ్ ఆలయంలో సునాక్ దంపతుల పూజలు
లండన్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ్‌ ఆలయాన్ని ఆదివారం రిషి సునాక్‌ దంపతులు సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీ20లో వరల్డ్‌ కప్‌లో భారత్‌ విజయం మొదలు హిందూ మతంపై విశ్వాసం వరకు అనేక విషయాలను ఆలయ సందర్శన అనంతరం ప్రస్తావించారు. తాను కూడా హిందువునేనని, ఆ మతం నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని అన్నారు. బ్రిటన్‌ పార్లమెంటు సభ్యుడిగా భగవద్గీతపై ప్రమాణం చేయడం ఎంతో గర్వంగా భావిస్తానని చెప్పారు. అంతేకాకుండా హిందువులు గర్వించేలా విధానాలను కొనసాగిస్తానని ప్రవాస భారతీయులకు హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

భక్తులతో అక్షతామూర్తి (Associated Press)
భక్తులతో సునాక్ (Associated Press)
స్వామినారాయణ్ ఆలయంలో సునాక్ దంపతులు (Associated Press)

కీర్‌ స్టార్మర్‌ కూడా!
మరోవైపు లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ కూడా కింగ్స్‌బరీలో ఉన్న మరో స్వామినారాయణ్‌ ఆలయాన్ని సందర్శించారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూనే హిందూ ఆలయాల రక్షణ, ఈ వర్గంపై దాడులను దీటుగా ఎదుర్కొనే చర్యలు తమ మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో దాదాపు 10లక్షల మంది హిందువులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఓటర్ల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది. దీంతో ఈ వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు హిందూ మేనిఫెస్టో పేరుతో ప్రధాన పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు తాజా ఎన్నికల్లో రిషి సునాక్‌ కాస్త వెనకబడినట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులు ఎటువైపు మొగ్గుచూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.జులై 4న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.

స్వామినారాయణ్ ఆలయంలో కీర్‌ స్టార్మర్‌ (Associated Press)
స్వామినారాయణ్ ఆలయంలో కీర్‌ స్టార్మర్‌ (Associated Press)

ABOUT THE AUTHOR

...view details