Sheikh Hasina In India :బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కోరుకున్నన్ని నాళ్లు భారత్‌లోనే ఉండనివ్వాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ దౌత్యవేత్త మణిశంకర్ అయ్యర్ సూచించారు. షేక్ హసీనా హయాంలో భారత్‌కు అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. భారత్‌లో హసీనాకు ఆశ్రయం కల్పించడంపై అయ్యర్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘హసీనా కోరుకున్నన్ని నాళ్లు భారత్ ఆశ్రయం కల్పిస్తుందని భావిస్తున్నాను. అవసరమైతే జీవితాంతం భారత్‌లో ఉండే అవకాశం ఆమెకు లభిస్తుందని అనుకుంటున్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన 16వ అపీజే కోల్‌కతా సాహిత్య ఉత్సవంలో మణిశంకర్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెలలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి బంగ్లాదేశ్‌లో పర్యటించి, దౌత్యపరమైన చర్చలు జరపడాన్ని అయ్యర్ స్వాగతించారు. ఇకపై కూడా బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వంతో మంత్రిత్వ శాఖల స్థాయిలో భారత ప్రభుత్వం సంబంధాలను నెరపాల్సిన అవసరం ఉందన్నారు.
రాజకీయ వైరుధ్యాల వల్లే ఆ దాడులు
‘‘బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమే. ఎందుకంటే వాళ్లంతా షేక్ హసీనాకు గతంలో మద్దతుగా నిలిచేవారు. రాజకీయపరమైన వైరుధ్యాల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయి’’ అని మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ, ‘‘పాకిస్తానీలు కూడా భారతీయుల్లాంటి వారే. కానీ దేశ విభజన అనే ప్రమాదం వల్లే వాళ్లు వేరే దేశంలో ఉండిపోవాల్సి వచ్చింది’’ అని చెప్పారు. ‘‘నేను ఒక తమిళుణ్ని. నా భార్య ఒక పంజాబీ. భారతదేశ పంజాబీ, పాకిస్తానీ పంజాబీ మధ్య ఉన్న తేడా కంటే, నాకు, నా భార్యకు మధ్యనున్న తేడానే ఎక్కువ’’ అని అయ్యర్ తెలిపారు.