Kim Called To Ready For War : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిర భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉత్తర కొరియాలోని కిమ్ జోంగ్ ఇల్ మిలిటరీ యూనివర్సిటీని బుధవారం సందర్శించారు కిమ్. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో నెలకొల్పారు. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు.
'దేశం చుట్టూ అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉంది' అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
కాగా, ఉత్తర కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయపడుతోంది. ఇటీవల కొరియా ఘన ఇంధనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తిమంతమైందని నిపుణులు చెబుతున్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.