ISKCON In Bangladesh : ఇస్కాన్‌పై నిషేధం విధించేందుకు బంగ్లాదేశ్‌లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, ఇస్కాన్ ఇటీవలి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. చిన్మయ్ కృష్ణదాస్‌ను జైలుకు తరలిస్తున్న సమయంలో చెలరేగిన అల్లర్లలో న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్ మృతి చెందారు. దీంతో ఇస్కాన్ కార్యకలాపాలను నిషేధించాలని ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయవాది మోనిర్ ఉద్దిన్ ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చిన్మయ్ కృష్ణదాస్‌ను జైలుకు తరలిస్తున్న సమయంలో చెలరేగిన అల్లర్ల అంశంలో ప్రభుత్వం చర్యలు తీసుకుందని అటార్నీ జనరల్ జస్టిస్ ఫర్హా మహబూబ్, జస్టిస్ దెబాసిస్ రాయ్ చౌధురీ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్ హత్య కేసులో, ఇస్కాన్ కార్యకలాపాలపై వేర్వేరు కేసులను నమోదు చేశామని తెలిపారు. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 33 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. అటార్నీ జనరల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న బంగ్లాదేశ్ హైకోర్టు ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించడానికి నిరాకరించింది.
'బంగ్లాదేశ్‌పై ఆంక్షలు విధించాలి'
అటు బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులను అమెరికాలోని హిందూ సంఘాలు ఖండించాయి. ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి. మైనార్టీలపై దాడుల విషయంలో ప్రపంచ మీడియా మౌనంగా ఉండటం దారుణమని మండిపడ్డాయి. కృష్ణదాస్ అరెస్టు, హిందూ ఆలయాలపై దాడులు బంగ్లాదేశ్‌లో మతపరమైన విద్వేషాల పెరుగుదలను సూచిస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ అమెరికా శాఖ (VHPA) అధ్యక్షుడు అజయ్ షా అన్నారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉంటే దుండగులు మరింత రెచ్చిపోతారని వీహెచ్‌పీఏ ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిత్తల్ వ్యాఖ్యానించారు.