Premature Wrinkles Reasons:ఎవరిలోనైనా వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం. కానీ, ప్రస్తుత రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే చర్మంపై ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందుకు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి.. ఇలా ఏదైనా కారణం కావచ్చు. అయితే చిన్న వయసులోనే యువత ముఖంపై ముడతలు రావడానికి కేవలం ఇవి మాత్రమే కారణం కావని.. ఇతర ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ధూమపానం :యువతలో అకాల ముడతలు రావడానికి ధూమపానం ప్రధానం కారణంగా చెప్పుకోవచ్చు. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అతిగా స్మోక్ చేయడం వల్ల చర్మం డల్‌గా మారి వృద్ధాప్యంగా కనిపిస్తుంది. పొగలోని సమ్మేళనాలు కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్లను దెబ్బతీస్తాయి. రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రభావాలు చిన్న వయసులోనే చర్మంపై ముఖ్యంగా నోరు, కళ్ల చుట్టూ అకాల ముడతలు ఏర్పడడానికి దారి తీస్తాయి.
సరైన పోషకాహారం తీసుకోకపోవడం : స్కిన్ ఆరోగ్యవంతంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలు మనం తీసుకునే డైట్లో భాగం కావాలి. ఎందుకంటే అవి చర్మంపై బాగా ప్రభావం చూపిస్తాయి. వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తాయి. కానీ, ఎప్పుడైతే మీరు చర్మ సంరక్షణకు అవసరమయ్యే పోషకాలు అందించే ఆహార పదార్థాలు తీసుకోరో.. అప్పుడు ఆ ప్రభావం తప్పకుండా స్కిన్ మీద కనిపిస్తుంది. ఫలితంగా చర్మంపై అకాల ముడతలు ఏర్పడతాయి. కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండాలంటే మీ డైట్లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారాన్ని చేర్చుకోవాలి.
చర్మంపై ముడతలా? ఈ ప్యాక్ వాడండి !
నిద్ర లేమి :ప్రస్తుత రోజుల్లో చాలా మంది పని ఒత్తిడి, ఇతర కారణాల చేత నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే చిన్న వయసులోనే చర్మంపై అకాల ముడతలు రావడానికి నిద్రలేమి కూడా ఓ కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తగినంత నిద్ర లేకపోవడం వల్ల చర్మ కణాలు అలసిపోయి చర్మంపై ముడతలు రావడానికి కారణం అవుతోంది. అందుకే రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
జన్యుశాస్త్రం : చిన్న వయసులోనే ముడతలు రావడానికి జన్యుశాస్త్రం కూడా ఓ కారణం కావొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మీ తల్లిదండ్రులు లేదా దగ్గరి బంధువులు అకాల ముడతలు వచ్చిన చరిత్రను కలిగి ఉన్నట్లయితే, మీరు చిన్న వయసులోనే ఆ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అంటే వంశపారంపర్యంగా ఆ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట.
సూర్యరశ్మికి గురికావడం : మనం బయట ఎండలో తిరిగేటప్పుడు సూర్మరశ్మి వల్ల చర్మం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాలు ఎక్కువసేపు బాడీపై పడడం వల్ల చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్‌లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది అకాల వృద్ధాప్యం, ముడతలకు దారితీస్తుంది. ముఖ్యంగా UV రేడియేషన్ కొల్లాజెన్, ఎలాస్టిన్‌లను విచ్ఛిన్నం చేస్తుంది. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలకంగా ఉంటాయి. కానీ అవి విచ్ఛిన్నం కావడం వల్ల చిన్న వయసులోనే ముడతలు, ఫైన్ లైన్స్, సన్‌స్పాట్‌లు ఏర్పడతాయి. అందుకే ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం, రక్షిత దుస్తులను ధరించడం వంటి రక్షణ చర్యలు పాటించడం ద్వారా ఆ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు.
HEALTHY SKIN: మీ చర్మం మెరిసిపోవాలంటే.. ఇవి తినాల్సిందే, తాగాల్సిందే..!
ఇంట్లోని వస్తువులతోనే ఒంటికి సొబగులు