తెలంగాణ

telangana

ETV Bharat / health

స్వీట్స్​ చూడగానే మనసు లాగేస్తోందా? - ఈ డాక్టర్ చెప్పినట్టు చేస్తే ఆగిపోతుందట!

- తీపి పదార్థాలతో అనారోగ్య ముప్పు - ఈ టిప్స్ పాటించాలంటున్న నిపుణులు

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

How to Reduce Sugar Cravings
How to Reduce Sugar Cravings (ETV Bharat)

How to Reduce Sugar Cravings : తీపి పదార్థాలు చూస్తే తినకుండా ఉండలేరు చాలా మంది. అర్ధరాత్రి ఆకలేసినా ఏదో ఒక స్వీటు తినాల్సిందే. ఈ అలవాటు.. డయాబెటిస్​, ఊబకాయం, హృదయ సంబంధిత వ్యాధులు, డెంటల్​ ప్రాబ్లమ్స్​, జీర్ణసమస్యలు సహా ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే.. ఈ విషయం తెలిసినా నియంత్రించుకోలేకపోతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థంకాక ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే తీపి తినాలనే కోరికను తగ్గించుకోవాలంటే ఈ అలవాట్లు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

తీపి పదార్థాలను తినకుండా ఉండలేకపోవడాన్ని సమస్య అనే కంటే, ఓ అలవాటుగా చెప్పొచ్చంటున్నారు పోషకాహార నిపుణులు డాక్టర్​ జానకీ శ్రీనాథ్​. కొంతమంది చికెన్‌ని ఇష్టపడితే, మరికొందరు ఐస్‌క్రీమ్‌లు, ఇంకొందరు చాక్లెట్లు.. వంటివి అతిగా తింటూ ఉంటారు. రుచి, సువాసన, టెక్స్చర్స్, టెంపరేచర్, క్రంచీ.. లను సెన్సోరియల్‌ ఆట్రిబ్యూట్స్‌ అంటాం. వీటిని జ్ఞానేంద్రియాలు గ్రహించడం వల్ల తినాలనే కోరిక కలుగుతుంది. అలా చాలా మంది స్వీట్లు తినడాన్ని నియంత్రించుకోలేకపోతుంటారు. క్రమంగా మొదలైన ఈ అలవాటు దీర్ఘకాలంలో టీ, కాఫీ, మద్యపానంలాంటి వ్యసనంగానూ మారే అవకాశమూ ఉందని హెచ్చరిస్తున్నారు.

తీపి తినాలనే కోరిక ఎలా తగ్గించుకోవాలి:జీవనశైలి యాంత్రికంగా మారడంతో అందరిలోనూ ఒత్తిడి సహజమైపోయిందని డాక్టర్​ జానకీ శ్రీనాథ్​ అంటున్నారు. అయితే ఒత్తిడి నుంచి ఉపశమనానికి సంగీతం వినడమో, ఆరుబయట నడకకు వెళ్లడమో ఒకప్పుడు చేసేవారు. ఇప్పుడా పరిస్థితులూ లేవని.. దీంతో మనసు మళ్లించుకోవడానికి నోట్లో ఒక టాఫీ వేసుకోవడమో, స్వీటో, ఐస్‌క్రీమో ఆరగించేస్తున్నారని అంటున్నారు. అందుకే, తీపి తినడం వల్ల ఎదురయ్యే అనారోగ్య ముప్పుని గ్రహించి ఇంటికి స్వీట్లు తెచ్చిపెట్టుకోవడం ఆపేయమని సలహా ఇస్తున్నారు. ఒకవేళ ఉన్నా.. ఎదురుగా కనిపించకుండా చూసుకోమంటున్నారు.

  • తీపి రుచి చూడటమే ముఖ్యం అనుకుంటే స్వీటుని చిన్న ముక్కల్లా చేసి తిన్నా చాలని చెబుతున్నారు.
  • అధిక కేలరీలు ఉన్న పదార్థాలకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోమంటున్నారు. ఉదాహరణకు మోతీచూర్‌ లడ్డూ, గులాబ్‌జామ్‌ లాంటి ఎక్కువ పాకం ఉన్నవి కాకుండా రసమలై, బొరుగుల ఉండ, రాజ్‌గిరా చిక్కీ వంటివి తీసుకోమంటున్నారు.
  • రాగి, నువ్వుల లడ్డూలు, తక్కువ తీపితో చేసే ప్లెయిన్‌ కస్టర్డ్, జెల్లీలాంటివీ సిద్ధం చేసుకుని ఉంచుకుంటే తీపి తినాలనిపించినప్పుడు వీటిని తింటే మంచిదంటున్నారు.
  • పండ్లముక్కలు కోసి ఉంచుకుంటే.. తినాలనిపించినప్పుడు వీటిని తింటే మీ తీపి ఆలోచనల్ని పక్కనపెడతాయంటున్నారు. ముఖ్యంగా బెర్రీలు, ఆపిల్, పియర్ వంటి పండ్లు తీపి తినాలనే కోరికను తగ్గిస్తాయని చెబుతున్నారు.
  • తక్కువ మొత్తంలో డ్రైఫ్రూట్స్‌ని కూడా తీసుకోవచ్చంటున్నారు. బాదం, జీడిపప్పు, వాల్​నట్స్ వంటివి తినడం వల్ల శరీరానికి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయని.. ఇవి తీపి తినాలనే కోరికను తగ్గిస్తాయంటున్నారు. ఈ అలవాట్లతో ఎక్కువగా స్వీట్లు తినడం తగ్గించుకోవచ్చని.. ఓ సారి ప్రయత్నం చేయమని సలహా ఇస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నిజంగా చక్కెరకన్నా బెల్లం మంచిదా?

తీపి ఎక్కువగా తింటున్నారా? - ఇలా చెక్‌ పెట్టండి!

ABOUT THE AUTHOR

...view details