తెలంగాణ

telangana

ETV Bharat / health

రోజుకు ఎంత చక్కెర తినాలి? షుగర్ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేనట! - HOW MUCH SUGAR IS NORMAL PER DAY

-చక్కెర ఎక్కువైతే అధిక బరువు, ఊబకాయం, మధుమేహం -తక్కువైతే మెదడు, మనసుకు సంబంధించిన సమస్యలు!

How Much Sugar is Normal per Day
How Much Sugar is Normal per Day (Getty Images)

By ETV Bharat Health Team

Published : Dec 24, 2024, 10:53 AM IST

How Much Sugar is Normal per Day:తీపి పదార్థాలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి? దీనికి కారణం వీటిల్లోని చక్కెర. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందించటమే కాకుండా ఆనందాన్నీ ఇస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే, ఇది ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందేనని చెబుతున్నారు. చక్కెర అతిగా తింటే అధిక బరువు, ఊబకాయం, మధుమేహం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగని అతి తక్కువగా తింటే మెదడు, మనసుకు సంబంధించిన రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరిస్తున్నారు. మరి ఇంత చిత్రమైన చక్కెర కథేంటో? అది మెదడు మీద ఎలాంటి ప్రభావాలు చూపుతుందో? ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువైతే ఏమవుతుంది?
మన శరీరంలోని అన్ని కణాలకు అవసరమైన శక్తిని చక్కెర రకమైన గ్లూకోజే అందిస్తుందని చెబుుతున్నారు. మెదడులో కోట్లాది నాడీ కణాలుంటాయని.. అందుకే దీనికి ఇంకాస్త ఎక్కువ శక్తి అవసరం పడుతుందని వివరిస్తున్నారు. నిజానికి మన శరీరంలోని మొత్తం గ్లూకోజులో సగం వరకూ మెదడే ఉపయోగించుకుంటుందని వెల్లడిస్తున్నారు. ఆలోచనలు, జ్ఞాపకశక్తి, నేర్చుకోవటం వంటి పనులకు ఇది చక్కెర మీద ఆధారపడుతుందని అంటున్నారు. అందువల్ల గ్లూకోజు తగ్గితే నాడుల మధ్య సమాచారాన్ని చేరవేసే రసాయనాలు న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ ఉత్పత్తి కావని పేర్కొన్నారు. ఫలితంగా నాడుల మధ్య సమాచార వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఏకాగ్రత లోపించడమే కాకుండా.. విషయగ్రహణ సామర్థ్యం మందగిస్తుందని తెలిపారు. డొపమిన్‌ హార్మోన్‌ తగ్గటం వల్ల పార్కిన్సన్స్‌ జబ్బుకు దారితీస్తుందని వెల్లడించారు. అసిటీల్‌కొలీన్‌ తగ్గటంతో అల్జీమర్స్, మయస్థీనియా గ్రేవిస్‌ జబ్బుల ముప్పు పెరుగుతుందంటున్నారు. గ్లుటమేట్ బాగా తగ్గటం వల్ల మూర్ఛ రావొచ్చని.. సెరటోనిన్‌ తగ్గితే తీవ్ర కుంగుబాటు తలెత్తొచ్చని అంటున్నారు.

"తీపి పదార్థాలను తీసుకోకుండా ఉండడం మహా కష్టం. మత్తు పదార్థాల లాగానే చక్కెర కూడా మెదడులోని నాడీ మార్గాలను ఉత్తేజితం చేస్తుంది. చక్కెరను తిన్నప్పుడు మత్తు గ్రాహకాలు ప్రేరేపితం అవుతాయి. ఇవి హాయి భావనను కలిగించే డొపమిన్‌ హార్మోన్‌ను రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్‌ మోతాదు తగ్గగానే మళ్లీ తీపిని తినేలా ఆలోచనను రేకెతెత్తిస్తుంది. ఫలితంగా మరింత ఎక్కువగా తినాలనే కోరిక మనలో కలిగి ఇది వదల్లేని స్థితికీ చేరొచ్చు. ఎందుకంటే వ్యసనంతో ముడిపడిన మెదడులోని కొన్ని భాగాలనూ చక్కెర ప్రేరేపిస్తుంది. కొకైన్‌ను తీసుకున్నప్పుడు మెదడులో ఉత్తేజితమయ్యే భాగాలే చక్కెర తిన్నప్పుడూ ప్రేరేపితం అవుతున్నట్టు ఫంక్షనల్‌ ఎంఆర్‌ఐ స్కాన్‌ అధ్యయనాల్లో తేలింది."

--డాక్టర్ పి. రంగనాథం, న్యూరోసర్జన్

ఎక్కువైతే ప్రమాదమే
చక్కెర మరీ ఎక్కువగా తీసుకుంటే మెదడులో అనుసంధాన వ్యవస్థ క్షీణిస్తుందని ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి. రంగనాథం చెబుతున్నారు. " చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల నాడీకణాలను అదుపులో పెట్టే రసాయనాలు అస్తవ్యస్తమై వారిలో ప్రవర్తన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. జ్ఞాపకశక్తికి కీలక కేంద్రమైన హిప్పోక్యాంపస్‌ కూడా అస్తవ్యస్తమై మతిమరుపు సమస్య తలెత్తుతుంది. ఇంకా మెదడు పరిమాణమూ కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. సూక్ష్మ రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడడమే కాకుండా.. మెదడులో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇంకా విషయగ్రహణ సమస్యలు, మెదడుకు త్వరగా వృద్ధాప్యం రావటం, ఆందోళన, కుంగుబాటు, మెదడులో వాపు సమస్యలు తలెత్తుతాయి. మెదడు ప్రొటీన్‌ (బ్రెయిన్‌ డిరైవ్డ్‌న్యూట్రోఫిక్‌ ఫ్యాక్టర్‌) సన్నగిల్లుతుంది. నాడీ కణాల వృద్ధి, మనుగడకు తోడ్పడే దీని మోతాదులు తగ్గితే మెదడు త్వరగా వృద్ధాప్యం వస్తుంది. చక్కెర ఎక్కువైతే ఒత్తిడి, భయం, ఆందోళన ప్రతిచర్యలు సైతం ఎక్కువ అవుతాయి. టైప్‌-2 మధుమేహం గలవారికి అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది." అని వివరిస్తున్నారు.

వాడకంలో మనమే ముందు
గత శతాబ్దం నుంచీ ప్రపంచవ్యాప్తంగా పంచదార వినియోగం గణనీయంగా పెరుగుతూ వస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రెండో స్థానంలో.. వినియోగంలోనైతే మొదటిస్థానంలో ఉన్నామన్నారు. ప్రస్తుతం తీపి, శక్తి కలిగించే పదార్థాలు ప్రతి చోటా అందుబాటులో ఉంటున్నాయని వివరిస్తున్నారు. చాక్లెట్లు, మిఠాయిలు, కేక్‌లు, బిస్కట్లు, కూల్‌డ్రింకుల రూపంలో అన్నిచోట్లా దొరుకుతోందని చెబుతున్నారు. దీంతో అవసరం లేకపోయినా ఎక్కువగా తీసుకుంటూ వస్తున్నామని పేర్కొంటున్నారు. కానీ, సగటున రోజుకు 24-36 గ్రాముల చక్కెర తీసుకోవచ్చన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చెబుతోంది.

మితం మీద దృష్టి
ఇప్పటికే మనదేశం మధుమేహ రాజధానిగా మారిందని అధ్యయనాలు చెబుతున్నాయి. సుమారు 11శాతం మంది మధుమేహంతో బాధపడుతుండగా.. మరో 15శాతం మంది ముందస్తు మధుమేహం (ప్రిడయాబిటిస్‌)తో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. ఇందుకు జీవనశైలి, ఆహార మార్పులే ప్రధానంగా దోహదం చేస్తున్నట్టు ఐసీఎంఆర్‌-ఇండియాబ్‌ అధ్యయనం వెల్లడిస్తుంది. మధుమేహం గలవారిలో పట్టణాల్లో 16% మందికి, పల్లెల్లో 9% మందికి ఇవే ముప్పు కారకాలుగా పరిణమిస్తున్నట్టు వివరిస్తుంది. మధుమేహం మూలంగా పక్షవాతం, గుండెజబ్బు, అధిక రక్తపోటు జబ్బులెన్నో ముంచుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే శతాబ్దాల నుంచి మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చేసిన చక్కెర వినియోగాన్ని తగ్గించటానికి కఠినమైన నియమాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మూత్రం ఎక్కువగా వస్తుంటే షుగర్ వచ్చినట్లేనా? తరచూగా మూత్రవిసర్జనకు కారణాలేంటి?

ఆ ఫుడ్ తింటే పెద్దపేగు క్యాన్సర్‌ వస్తుందట జాగ్రత్త! ఈ డైట్ పాటిస్తే సేఫ్!

ABOUT THE AUTHOR

...view details