Health Benefits Of Eating Betel Leaves :తమలపాకులు.. ఇంట్లో జరిగే పూజలు, శుభకార్యాలకు, ముత్తైదువులకు వాయనమివ్వడానికి.. పూలు పండ్లతో పాటు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే.. కొంతమంది భోజనం చేశాక తమలపాకు, వక్క, సున్నం కలిపి కిల్లీ వేసుకుంటుంటారు. విందు భోజనం తర్వాత తీసుకునే తాంబూలం రుచిగా ఉండడమే కాదు.. జీర్ణశక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. కేవలం అదొక్కటే కాదు.. ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యల నివారణకు తమలపాకులోని ఔషధగుణాలు దివ్య ఔషధంలా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. మరి, తమలపాకులతో(Betel Leaves) ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తమలపాకుల్లో మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి సహా అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ప్రయోజనాలు చూస్తే..
డయాబెటిస్ కంట్రోల్ :ఈరోజుల్లో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్తో బాధపడుతున్నారు. అలాంటి వారికి తమలపాకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు. కాబట్టి, షుగర్ పేషెంట్లు తమలపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.
2011లో డయాబెటిస్ రీసెర్చ్ అండ్ క్లినికల్ ప్రాక్టీస్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 12 వారాలపాటు రోజుకు 3 గ్రాముల తమలపాకుల పొడిని వాటర్‌లో వేసుకొని తాగిన టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో రక్తంలోని చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇండియాలోని చెన్నైలోని మద్రాస్ మెడికల్ కళాశాలలో డయాబెటిక్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రాజేంద్రన్ పాల్గొన్నారు. తమలపాకులలో యాంటీడయాబెటిక్ సమ్మేళనాలు ఉంటాయని.. అవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
గ్యాస్ట్రిక్ సమస్యలు నయం :గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో తమలపాకులోని ఔషధ గుణాలు చాలా చక్కగా పనిచేస్తాయంటున్నారు. తమలపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చంటున్నారు.
మూత్ర సమస్యలకు చెక్ :తమలపాకులు మూత్ర సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం క్రమం తప్పకుండా టీ స్పూన్ తమలపాకుల రసాన్ని తీసుకోండి. ఇది శరీరం నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా మూత్ర సమస్యల నుంచి మంచి రిలీఫ్ లభిస్తుందంటున్నారు.