Difference Between PCOS and PCOD :మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జన్యువులు వంటి వివిధ కారణాల వల్ల నేడు చాలా మంది అమ్మాయిలు పీసీఓఎస్, పీసీఓడీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. అధిక శాతం మంది ఇవి రెండూ ఒకటేనని అనుకుంటారు. కానీ.. వీటి లక్షణాలు కొంత భిన్నంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి వీడి మధ్య మధ్య తేడాలు ఏంటీ ? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి ? ఈ సమస్యలను ఎలా నివారించాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్ (పీసీఓడీ) :
- అండాశయం నుంచి అండం విడుదల కాకుండా ఉండిపోవడంతో పీరియడ్స్ రావు. అండం అండాశయంలోనే ఉండటంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనినే 'పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్' (పీసీఓడీ) అని అంటారు.
- వ్యాయామం చేయకపోవడం, ఫాస్ట్‌ఫుడ్, జంక్ ఫుడ్, మైదాతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
- దీనివల్ల ఎక్కువ మందికి నెలసరి తక్కువగా వస్తుంది.
- అలాగే కొంతమందిలో మగవాళ్ల హార్మోన్లు పెరుగుతాయి. ఇంకా అవాంఛిత రోమాలు ఎక్కడ పడితే అక్కడ వస్తాయి.
- స్వీట్ పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తుంది.
- గర్భధారణ ఆలస్యం కావడంతోపాటు వచ్చినా నిలవడం కష్టంగా ఉంటుందని నిపుణులంటున్నారు.
- ఇంకా మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు వస్తాయని చెబుతున్నారు.
పీసీఓఎస్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?
పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అంటే ఏమిటీ ?
- ఆడవాళ్ల శరీరంలో ఆండ్రోజెన్ లేదా టెస్టోస్టిరాన్ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది క్రమంగా 'పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్' (పీసీఒఎస్) దారితీస్తుందని నిపుణులంటున్నారు.
- పీసీఓఎస్ వల్ల బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, మొటిమలు, జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్య ఎక్కువవడం, మూడ్ స్వింగ్స్.. వంటి సమస్యలు తలెత్తుతాయి.
- గర్భం దాల్చలేకపోవడానికి పీసీఓఎస్ కూడా ఒక కారణం కావచ్చు! కాబట్టి దీనిని నిర్ధారించుకోవడానికి డాక్టర్‌ని సంప్రదించి వారు సూచించిన టెస్ట్‌లు చేయించుకోవాలి.
- పీసీఓఎస్ ఉన్న వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 2022లో 'World Journal of Diabetes' జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఉన్న స్త్రీలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని వుహాన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎండోక్రినాలజిస్ట్ 'డాక్టర్ Xue-Mei Huang' పాల్గొన్నారు. PCOS ఉన్న స్త్రీలలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
- శరీరంలో హార్మోన్ల అసమతుల్యత క్రమంగా పీసీఓఎస్‌కు దారితీసి.. తలనొప్పి వస్తుంది.
- ఈ సమస్యతో బాధపడేవారిలో చంకలు, మడతల వద్ద చర్మం నలుపు రంగులోకి మారుతుందని నిపుణులు చెబుతున్నారు.