Salman Khan Kamal Haasan Movie :సాధారణంగా రెండు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం నెలకొంటుంది. అదే ఆయా చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్రతారలైతే ఇక థియేటర్లలో పండగే. త్వరలోనే అదే జరగనున్నట్లు తెలుస్తోంది. 'జవాన్' ఫేమ్ స్టార్ డైరెక్టర్ అట్లీ చిత్రం దీనికి వేదిక కానుంది. తాజాగా ఆయన ఓ భారీ మల్టీస్టారర్‌కు ప్లాన్ చేసినట్లు సమాచారం. దీని ద్వారా ఎప్పుడూ చూడని ఓ కొత్త కాంబోను అభిమానులకు చూపించేందుకు అట్లీ ప్లాన్ చేసినట్లు సమాచారం.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి పనిచేయనున్నారట. ఇప్పటికే వీరితో సంప్రదింపులు కూడా సాగినట్లు కొన్ని రూమర్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడీ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం తాజాగా బయటకొచ్చింది. అదేంటంటే 2025 జనవరి కల్లా ప్రీప్రొడక్షన్ పనులు ముగించుకుని డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
"ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ మూవీ కోసం సల్మాన్, కమల్‌తో అట్లీ మాట్లాడారు. వారిద్దరూ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అంతేకాకుండా అట్లీ కూడా ఈ చిత్రాన్ని మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్ సీక్వెస్స్లతో తీర్చిదిద్దుతున్నారు. వీలైనంత త్వరగా కథను పూర్తి చేసి అక్టోబరు కల్లా ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాదికల్లా దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు" అని డైరెక్టర్ అట్లీ సన్నిహిత వర్గాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాయి.