తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇది తండ్రీకొడుకుల లవ్​ స్టోరీ! - సందీప్‌ కిషన్‌ 'మజాకా' ఎలా ఉందంటే? - MAZAKA TELUGU REVIEW

ఇది తండ్రీకొడుకుల లవ్​ స్టోరీ! - సందీప్‌ కిషన్‌ ఖాతాలో ఈ సారి హిట్‌ పడిందా?

Mazaka Movie Review
Mazaka Movie Review (Source : Mazaka Movie Poster)

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2025, 10:19 AM IST

Mazaka Movie Review :టాలీవుడ్​ యంగ్​ హీరో సందీప్‌ కిషన్ లీడ్​ రోల్​లో డైరెక్టర్ త్రినాథ్ రావు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'మజాకా'. శివరాత్రి సందర్భంగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే ?

కథేంటంటే :
వెంకటరమణ (రావు రమేష్‌), కృష్ణ (సందీప్ కిష‌న్) తండ్రీ కొడుకులు. ఇంట్లో ఆడదిక్కు లేక‌పోవ‌డం వల్ల ఒక‌రి బాగోగులు మ‌రొక‌రు చూసుకుంటూ ఉంటారు. అయితే ఎలాగైనా త‌న కొడుక్కి పెళ్లి చేసి ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫొటోని చూసుకోవాల‌నేది వెంక‌ట‌ర‌మ‌ణ ఆశ‌. అయితే, ఎవ్వ‌రూ తనకు అమ్మాయిని ఇవ్వ‌డానికి ముందుకు రారు. ఇక వెంకటరమణ పెళ్లి చేసుకుంటే ఈ స‌మ‌స్య‌లన్నీ తీరుతాయ‌నే స‌ల‌హా ఇస్తారు. అది విన్న వెంట‌క‌ర‌మ‌ణ‌కి య‌శోద (అన్షు) అనే మ‌హిళ తార‌స‌ప‌డుతుంది. లేటు వ‌య‌సులో ఆమె ప్రేమ‌లో మునిగిపోతాడు. మ‌రోవైపు త‌న‌యుడు కృష్ణ కూడా మీరా (రీతూ వ‌ర్మ‌) ప్రేమ‌లో ప‌డ‌తాడు.

అలా తండ్రీ కొడుకులు ఇద్ద‌రూ ఒకేసారి లవ్​ లెటర్లు రాసుకుంటూ, బ‌స్‌స్టాపుల చుట్టూ తిరుగుతూ గ‌డుపుతుంటారు. ఒక‌రి ప్రేమ గురించి మ‌రొక‌రికి ఎప్పుడు తెలిసింది?వీళ్ల ప్రేమ‌క‌థ‌ల్లో ఎలాంటి మ‌లుపులు చోటు చేసుకున్నాయి?పెళ్లిక సిద్ధ‌మ‌య్యాక ఎలాంటి చిక్కులు వ‌చ్చాయి? ప‌గ‌తో ర‌గిలిపోయే భార్గ‌వ్ వ‌ర్మ (ముర‌ళీశ‌ర్మ‌)కీ, ఈ తండ్రీ కొడుకుల‌కీ మ‌ధ్య సంబంధం ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే :
క‌థ నుంచి స‌హ‌జంగా పండే కామెడీని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులు కొంత‌మందైతే, తెర‌పైన ఓవ‌ర్ ది బోర్డ్‌ త‌ర‌హా స‌న్నివేశాల్నీ చూస్తూ న‌వ్వుకునేవాళ్లు కొంత‌మంది. రెండో ర‌కం ప్రేక్షకుల‌ను మెప్పించే అంశాలున్న చిత్రమిది. రాత్రిళ్లు కూర్చుని తండ్రీ కొడుకులు పోటీప‌డి ప్రేమ‌లేఖ‌లు రాసుకోవ‌డం, ఇద్ద‌రూ తాము మ‌న‌సిచ్చిన‌వాళ్ల కోసం గోడ‌లు దూక‌డం, బ‌స్సుల్లో ఫాలో కావ‌డం ఈ త‌ర‌హా స‌న్నివేశాలు తెర‌పై ఎంత స‌ర‌దాగా అనిపిస్తాయో, అంత టూ మ‌చ్ అనే అభిప్రాయాన్నీ కలిగిస్తాయి. ఈ సినిమాలో తండ్రి ప్రేమ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల‌న్నీ అదే రీతినే సాగుతుంటాయి.

వాటినీ, క‌థ‌లోని లాజిక్స్‌నీ ప‌ట్టించుకోకుండా చూస్తే న‌వ్వుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ మ‌ధ్య కామెడీ కోసం ద్వంద్వార్థాలతో కూడిన సంభాష‌ణ‌లు, అస‌భ్య‌క‌రమైన స‌న్నివేశాల్ని ఎంచుకోవ‌డం చూస్తున్నాం. ఈ సినిమాతో అలాంటి ఇబ్బందులేమీ లేవు. ఇంటిల్లిపాదీ చూడ‌గ‌లిగేలా స్వ‌చ్ఛ‌మైన స‌న్నివేశాల‌తో హాస్యం పండించే ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది.

తండ్రీ తన‌యులు లవ్​ స్టోరీని సమాంత‌రంగా న‌డిపిస్తూ ఫస్ట్​హాఫ్​ను రూపొందించారు డైరెక్టర్. ఒక‌రి లవ్​స్టోరీ మ‌రొక‌రికి తెలిసిపోవ‌డం, ఆ త‌ర్వాత వ‌చ్చే లవ్​ లెటర్ల ఎపిసోడ్, భార్గ‌వ్ వ‌ర్మ రివెంజ్​ నేప‌థ్యంలో వ‌చ్చే సీన్స్​తో సినిమా ఫన్నీగా సాగిపోతుంది. క‌థ‌, క‌థ‌నాలు కూడా ఊహ‌కు తగ్గట్టుగానే ఉంటాయి. సీన్స్​లోనూ కొత్త‌ద‌నం ఏమీ క‌నిపించ‌దు. అయినా స‌రే, సినిమా టైమ్​పాస్​గా గడిచిపోతుంది. ఇంటర్వెల్​కు ముందు వ‌చ్చే సీన్స్​ కాస్త ఇంట్రెస్టింగ్​గా ఉంటాయి.

ఇక సెకెండాఫ్​లో స్టార్టింగ్​లోనే అంద‌రి అంచ‌నాల‌కు డిఫరెంట్​గా స్టోరీలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది మూవీ. అక్క‌డ నుంచి దాని చుట్టూనే సీన్స్​ తిరుగుతాయి. ట్విస్ట్​ కూడా ఆక‌ట్టుకుంటుంది. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చే సీన్స్​లోనే బ‌లం లేదు. అన‌కాప‌ల్లి పెళ్లి ఎపిసోడ్ కూడా లాగ్​లా అనిపిస్తుంది.

అయితే ఈ సినిమాలో కామెడీనే కాదు, ఎమోషన్స్ కూడా ఉంటాయి. క్లైమాక్స్‌లోనే వాటిపై అందరూ ఫోకస్ పెడుతారు. తండ్రీ త‌న‌యుల బంధం, హీరో హీరోయిన్ల ఎపిసోడ్‌లోని సంక్లిష్ట‌త‌ని మ‌రింత బ‌లంగా ఆవిష్క‌రించి భావోద్వేగాల్ని పండించే ఆస్కారం ఉన్నప్పటికీ డైరెక్టర్ వాటిపై ఫోకస్ పెట్టలేదు. దాంతో ఎమోషన్స్​ కూడా కామెడీలాగే బ‌ల‌వంతంగానే పిండినట్టు అనిపిస్తుంటుంది. అయితే స్టోరీని క‌థ‌ని ముగించిన తీరు ఆడియెన్స్​ను ఆకట్టుకుంటుంది.

ఎవ‌రెలా చేశారంటే :
సందీప్‌ కిష‌న్‌, రావు ర‌మేష్ మ‌ధ్య ఉన్న రిలేషన్​షిప్​ ఈ సినిమాకి కీల‌కం. ఆ ఇద్ద‌రూ తండ్రీ కొడుకులుగా క‌నిపించిన తీరు, హుషారైన న‌ట‌న మెప్పిస్తుంది. సందీప్‌కిష‌న్ ప‌క్కింటి కుర్రాడి త‌ర‌హా పాత్ర‌లోనే క‌నిపిస్తాడు. కామెడీ ప‌రంగా ఆయ‌న టైమింగ్ బాగానే ఉంది. లేటు వ‌య‌సులో ప్రేమ‌లో ప‌డిన వ్య‌క్తిగా రావు రమేష్ క‌నిపిస్తారు. హీరోకి స‌మాన‌మైన ఆ పాత్ర‌లో యంగ్ లుక్‌లో క‌నిపిస్తూ ఆయ‌న సంద‌డి చేశారు. సీనియ‌ర్ హీరోల్ని దృష్టిలో ఉంచుకుని రాసిన ఆ పాత్ర‌కి రావు ర‌మేష్ లోటేమీ చేయ‌లేదు. అయితే, ఆయ‌న ప్రేమ‌లేఖ ప‌ట్టుకుని హీరోయిన్ చుట్టూ తిర‌గడం అంత‌గా కుద‌ర‌లేదనే అభిప్రాయం క‌లుగుతుంది.

ముర‌ళీశ‌ర్మ పాత్రని డిజైన్ చేసిన తీరు, ఆయ‌న న‌ట‌న ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. రీతూవ‌ర్మ‌, అన్షు బ‌ల‌మైన పాత్ర‌ల్లోనే క‌నిపిస్తారు. శ్రీనివాస్ రెడ్డి, ర‌ఘుబాబు, హైప‌ర్ ఆది అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తారు. పాట‌లు ఆక‌ట్టుకుంటాయి కానీ, అవి వ‌చ్చే సంద‌ర్భ‌మే కుద‌ర‌లేదు. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టే ఉంది. ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌కి అల‌వాటైన జోన‌ర్ ఇది. ర‌చ‌న ప‌రంగా ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే ఫ‌లితం వేరేలా ఉండేది. మాట‌లు ఆక‌ట్టుకుంటాయి.

  • బ‌లాలు
  • + హాస్యం
  • + ద్వితీయార్ధంలో మ‌లుపులు
  • + ప‌తాక స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ఊహ‌కు అందే క‌థ‌, క‌థ‌నాలు
  • - కొర‌వ‌డిన స‌హ‌జ‌త్వం
  • చివ‌రిగా : వినోదాల 'మజాకా'
  • గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details