Actress Left Studies For Movies : సినిమానే తన కెరీర్ అని ఫిక్స్ అయిపోయి సైకాలజీ డిగ్రీకి ఫుల్స్టాప్ పెట్టేసి మూవీస్‌లోకి వచ్చేసింది ఓ నటి. సినిమాల్లోకి రాకముందే కమర్షియల్ యాడ్స్‌లో కనిపించిన ఈ చిన్నది అనతికాలంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి పాపులర్ అయ్యింది. కానీ ఇప్పుడు మాత్రం సెలక్టివ్ రోల్స్ చేసేందుకు ఇష్టపడుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?
సోదరితో సినిమాల్లోకి ఎంట్రీ
అమృతా రావ్ అంటే అంతగా గుర్తుపట్టకపోవచ్చు కానీ 'అతిథి' సినిమా హీరోయిన్ అంతే ప్రేక్షకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ చిన్నది సినిమా ఎంట్రీ ఆసక్తికరంగా సాగింది. తన సోదరి ప్రీతికాతో కలిసి 'వోహ్ ప్యార్ మేరా' అనే మ్యూజిక్ వీడియోలో నటించింది అమృతా. అలా సినిమా ఇండస్ట్రీ వైపుకు అడుగులేసింది. ఆ తర్వాత 2002లో ఆర్య బబ్బార్‌తో కలిసి 'అబ్ కే బరస్' అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఇది తన డెబ్యూ మూవీ. తొలి చిత్రంతోనే అభిమానులను ఆకట్టుకున్న ఈ చిన్నది, ఆ తర్వాత అజయ్ దేవగన్ సరసన ' ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్'లో నటించింది. అప్పటి నుంచి వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2003లో 'ఇష్క్ విష్క్', 2005లో 'వాహ్ లైఫ్ హో తో ఐసీ', 2006లో 'వివాహ్' సినిమాలో నటించింది. 'వివాహ్' సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక సినిమాల్లోనే కాకుండా 2009లో పర్ఫెక్ట్ బ్రైడ్ అనే టెలివిజన్ షోలో జడ్జీగానూ వ్యవహరించింది.
పెళ్లి ఖర్చు రూ.1.5లక్షలు
2016లో ఆర్జే అన్మోల్‌ను వివాహం చేసుకుంది. వీళ్ల పెళ్లి కూడా అప్పట్లో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. ఎందుకంటే ఈ జంట తమ వివాహం కోసం కేవలం రూ.1.5లక్షలు మాత్రమే వెచ్చించారట. ఈ విషయాన్ని హీరోయిన్ స్వయంగా వెల్లడించింది.