Strategy for Inter Students for Board Exams :మరో 8 రోజుల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో ఒత్తిడి ఉండటం సాధారణం. దీని నుంచి బయటపడటం చాలా ముఖ్యం. ఒత్తిడిని ఎదుర్కోవడంతో పాటు పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మెదక్ డైట్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్, మానసిక వైద్య నిపుణులు రమేశ్ బాబు ఇలా వివరించారు.
మార్కులకు తగ్గుట్టుగా జవాబు :24 పేజీలతో కూడిన సమాధాన పత్రం ఇస్తారు. దాన్ని సరిగ్గా విభజించుకుని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. చివర్లో పేజీలు సరిపోలేదని హడావుడి పడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు 8 మార్కుల ప్రశ్నకు ఒకటిన్నర, రెండు పేజీల్లో, 4 మార్కుల వాటికి ఒక పేజీలో, 2 మార్కుల ప్రశ్నకు 4 నుంచి 10 లైన్లలో సమాధానం రాయాలి. తద్వారా అన్ని పేజీలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుంటుంది.
గత ప్రశ్నపత్రాల సాధన :ప్రస్తుతం పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. అందులోని ప్రధాన అంశాలను నోట్స్‌లో రాసుకొని వాటిని రివిజన్ చేస్తుండాలి. ఒక్కో పాఠ్యాంశానికి ఓ రోజు కేటాయిస్తే మంచిది. కొత్త విషయాలను చదవొద్దు. ఇప్పటికే ప్రిపేర్ అయిన టాపిక్స్‌ను చదువుతూ ఉండాలి. గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ఎంతో మేలు.
- పరీక్షకు ఒక రోజు ముందే హాల్‌టికెట్, పెన్నులు, ప్యాడ్ తదితర వాటిని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి.
- పరీక్షలో అన్ని సమాధానాలు రాసేలా ఇంటి దగ్గరే నిర్ధారించుకోవాలి. ఇందుకు అనుగుణంగా ఓసారి సాధన చేయాలి. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది.
తేలిక పాటి ఆహారం : పరీక్షకు వెళ్లే ముందు కచ్చితంగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువగా పండ్లు తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. ప్రస్తుతం మాంసాహారానికి, మసాల పదార్థాలు, మిఠాయి వంటి వాటికి కాస్త దూరంగా ఉంటే మంచిది. అందులోనూ పరీక్షకు ఒకటి, రెండు రోజుల ముందు అసలు తీసుకోవద్దు. అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎవరితో చర్చించొద్దు :పరీక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ప్రశ్నలు, సమాధానాలు ఎవరితో చర్చించొద్దు. పరీక్ష రాశాక తల్లిదండ్రులను ఒత్తిడికి గురిచేయొద్దు. ఇంటికెళ్లాక తదుపరి పరీక్షకు సంబంధించిన సబ్జెక్టులో ప్రధానాంశాలను చదువుకోవాలి. రాసి పెట్టుకున్న మెయిన్ పాయింట్స్ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. చూడకుండా రాస్తే చాలా వరకు గుర్తుకుంటాయి. పరీక్షల సమయంలో తగినంత నిద్ర పోవడం ఎంతో ప్రధానం.