ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / education-and-career

ఎడ్యుకేషన్​ లోన్​ తీసుకుంటున్నారా?- ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి - Education Loan - EDUCATION LOAN

Education Loan: విదేశాల్లో చదువుకోవాలన్న కల నెరవేర్చుకునే ఎంతో మంది విద్యార్థులు బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్నారు. బ్యాంకులతో పాటు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

education_loan
education_loan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 2:04 PM IST

Education Loan:విదేశాల్లో చదువుకోవాలన్న కోరిక ఎంతో మంది భారతీయ విద్యార్థులను దేశం విడిచి వెళ్లేలా చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురైనా భవిష్యత్‌ కోసం బాటలు వేసుకునేందుకు విదేశీ బాట పడుతున్నారు. అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా 19 శాతం పెరుగుతుండగా.. 2024 నాటికి విదేశాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 18 లక్షలకు చేరుకుంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థుల కలలను నెరవేర్చడానికి విద్యా రుణాలు ఎంతో కీలకంగా మారుతున్న తరుణంలో... రుణం తీసుకునేటప్పుడు కీలకమైన అంశాలు తెలుసుకోవాల్సిందే.

విదేశాల్లో విద్య అనగానే ముందుగా గుర్తొచ్చే అంశం ఖర్చు గురించే. విద్యార్థులు తమ గమ్యస్థానాన్ని ఎంచుకునేటప్పుడే అన్ని ఖర్చుల గురించి పూర్తి స్థాయిలో ఆలోచిస్తారు. విశ్వవిద్యాలయాలు అవి అందించే కోర్సుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా విదేశాల్లో చదువు ఖరీదైన వ్యవహారమైంది. విదేశాలకు వెళ్లాలంటే విద్యారుణం తప్పనిసరి అవసరంగా మారింది. బ్యాంకులతో పాటు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ విద్యా రుణాలను అందిస్తున్నాయి.

విదేశీ వర్సిటీల్లో ఉచిత కోర్సులు- నేరుగా పట్టా పొందే అవకాశాలెన్నో! - Free Education Abroad

ఖర్చును విశ్లేషించండి

విద్యా రుణం తీసుకునే ముందు కోర్సు పూర్తి చేసేందుకు అయ్యే ఎంత ఖర్చవుతుందో ముందుగానే అంచనా ఉండాలి. ముందస్తు సమాచారం కోసం ఇప్పటికే అక్కడ చదివిన, చదువుతున్న వారిని సంప్రదిస్తే మంచింది. ఇతరత్రా ఖర్చును సైతం ముందుగా అంచనా వేసుకోవాలి. కొంతమంది రుణదాతలు ఖర్చును అంచనా వేసేందుకు అందిస్తున్న కాలిక్యులేటర్లను ఉపయోగించుకోవచ్చు.

అవగాహన పెంచుకోండి

విద్యా రుణం ఎంచుకునే ముందు సొంతంగా కొంత పరిశోధన చేయడం తప్పనిసరి. ఇంతకు ముందు రుణాలు తీసుకున్న బంధువులు, స్నేహితులతో మాట్లాడడంతో పాటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ విషయంలో విద్యార్థులకు సహాయం అందిస్తాయి. విద్యా రుణాలు, అందులో ఉండే ప్రక్రియలపై ఈ సలహాలు విద్యార్థులకు ఎంతగానో తోడ్పడతాయి. రుణ దరఖాస్తుకు ముందే అర్హత, దరఖాస్తు విధానం, జతపరచాల్సిన పత్రాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి.

అన్ని ఖర్చులు దృష్టిలో ఉంచుకోవాలి...

విద్యా రుణం తీసుకునే ముందు అనుబంధ ఖర్చులనూ దృష్టిలో ఉంచుకోవాలి. ట్యూషన్‌ ఫీజులతోపాటు, ప్రయాణ ఖర్చులు, ల్యాప్‌టాప్‌, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్‌వ్యయాలకూ ప్రాధాన్యమివ్వాలి.

రుణదాత విషయంలో

ఎంతో ప్రత్యేకమైన విద్యా రుణాలు తీసుకునే సమయంలో సరైన విధానాన్ని పాటించాలి. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా అది దీర్ఘకాలం భారంగా మారుతుంది. కేవలం వడ్డీ రేట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోకుండా రుణంతో పాటు అవి అందించే ఇతర ప్రయోజనాలూ పరిగణించాలి.

భాగస్వామ్యం ఉంటే

కొన్ని కళాశాలలు, యూనివర్సిటీలతో రుణ సంస్థలకు ఒప్పందం ఉంటుంది. మీరు ఎంచుకున్న కళాశాల/విశ్వ విద్యాలయంతో భాగస్వామ్యం ఉన్న ఆర్థిక సంస్థలను పరిశీలించడం మంచిది. తద్వారా ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా అర్హత ఆధారంగా సులభంగా రుణాలు వచ్చేందుకు వీలుంటుంది.

రుణాలు తిరిగి చెల్లించేప్పుడు

విద్యా రుణాలను ఎంత కాలం కొనసాగించాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవడం తప్పనిసరి. విద్యార్థులు తమకు అనువైన కాల పరిమితిని ఎంచుకోవాలి. దీనికోసం ముందుగానే ఆర్థిక సంస్థలతో మాట్లాడుకోవాలి. మారటోరియం వ్యవధిలో విద్యార్థులు సాధారణ/పాక్షిక వడ్డీని చెల్లిచడం వల్ల భారం తగ్గుతుంది.

రుణం తీసుకునే ముందే పై అన్ని విషయాలపై అవగాహన పెంచుకుంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా అనుకున్న కోర్సును పూర్తి చేసేందుకు వీలవుతుందని అవన్సే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ-సీఈఓ అమిత్‌ గైండా తెలిపారు.

ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ - బెస్ట్ బెనిఫిట్స్ ఇవే! - Education Loan
విదేశీ విద్య కోసం లోన్ కావాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Education Loans For Studying Abroad

ABOUT THE AUTHOR

...view details