Google AI Courses For Free :ఇది హైటెక్ యుగం. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్(ఏఐ) టెక్నాలజీ హవా నడుస్తోంది. దీనికి సంబంధించిన స్కిల్స్ కలిగిన వారికి మార్కెట్లో ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్‌వేర్, మీడియా సహా చాలా రంగాలు ఇప్పుడు వాటికిి అవసరమైన రీతిలో ఏఐను వాడేస్తున్నాయి. ఈ తరుణంలో దిగ్గజ టెక్నాలజీ కంపెనీ గూగుల్ పూర్తి ఉచితంగా 10ఏఐ కోర్సులను అందిస్తోంది. ఆ కోర్సులు ఏమిటి ? వాటిలో ఎలా జాయిన్ కావాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. జనరేటివ్ ఏఐ ఇంట్రడక్షన్ కోర్సు
ఈ కోర్సులో జనరేటివ్ ఏఐ(Gen AI) అంటే ఏమిటి? ఏఐ టెక్నాలజీలో అది ఎలా ఉపయోగపడుతుంది? సాంప్రదాయిక మెషీన్ లెర్నింగ్ పద్ధతులకు ఇది ఎంత భిన్నమైంది? అనే అంశాలను నేర్పిస్తారు. గూగుల్ టూల్స్‌ను వాడుకొని సొంతంగా జనరేటివ్ ఏఐ యాప్‌లను ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా చెబుతారు. బాగా శ్రద్ధ పెడితే ఈ బేసిక్ ఆన్‌లైన్ కోర్సు పూర్తి కావడానికి 45 నిమిషాల సమయమే పడుతుంది
2. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇంట్రడక్షన్ కోర్స్
లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను సంక్షిప్తంగా LLM అంటారు. ఏఐ టెక్నాలజీలో వీటిని ఎందుకు వాడుతారు? ఏయే సందర్భాల్లో వాడుతారు? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పనితీరును మెరుగుపర్చడానికి మీరు ప్రాంప్ట్ ట్యూనింగ్‌ను ఎలా ఉపయోగించచ్చు ? అనేది ఈ కోర్సులో నేర్పిస్తారు. గూగుల్ టూల్స్‌ను వాడుకొని సొంతంగా జనరేటివ్ ఏఐ యాప్‌లను ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా ఇందులోనూ బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి కావడానికి కూడా 45 నిమిషాలే పడుతుంది.
3. రెస్పాన్సిబుల్ ఏఐ ఇంట్రడక్షన్ కోర్సు
గూగుల్ ఏఐ ప్రొడక్ట్స్‌లో రెస్పాన్సిబుల్ ఏఐను వాడుతుంటారు. ఏఐ టెక్నాలజీలో దీని వినియోగం ఎలా ఉంటుంది ? ఇది ఎలా పనిచేస్తుంది? అనే వివరాలను ఈ కోర్సులో బోధిస్తారు. గూగుల్ అనుసరించే 7 ఏఐ సూత్రాలను ఈ కోర్సులో భాగంగా నేర్పిస్తారు.
4. జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ కోర్సు
జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ కోర్సులో జనరేటివ్ ఏఐకి సంబంధించిన బేసిక్స్‌ను నేర్పిస్తారు. దీనితో పాటు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, రెస్పాన్సిబుల్ ఏఐలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని బోధిస్తారు. ఇవన్నీ నేర్చుకున్నాక, స్కిల్ బ్యాడ్జ్‌ను అందిస్తారు. ఈ కోర్సు చివర్లో నిర్వహించే క్విజ్‌లో వచ్చే స్కోరును బట్టి జనరేటివ్ ఏఐపై మీకు వచ్చిన అవగాహనా స్థాయిపై ఒక అంచనాకు రావచ్చు.
5. ఇమేజ్ జనరేషన్‌పై ఇంట్రడక్షన్ కోర్సు
ఏఐ టెక్నాలజీ ద్వారా ఇమేజ్ జనరేషన్‌పై ఈ కోర్సులో స్కిల్స్ నేర్పిస్తారు. వివిధ రకాల ఇమేజ్ జనరేషన్ మోడల్స్‌ను మీకు పరిచయం చేస్తారు. ఇవి భౌతిక శాస్త్రం, థర్మోడైనమిక్స్ ఆధారంగా పనిచేస్తాయి. గూగుల్ క్లౌడ్‌లోని అత్యాధునిక ఇమేజ్ జనరేషన్ మోడల్‌లు, వాటికి సంబంధించిన టూల్స్ గురించి బోధిస్తారు. ఇమేజ్ జనరేషన్ మోడల్‌ల పనితీరు గురించి వివరిస్తారు. ఏఐ వర్క్ఫ్లోనకు సంబంధించిన వెర్టెక్స్ AIపై అవగాహన కల్పిస్తారు.
6. ఎన్‌కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్ కోర్సు
ఈ కోర్సులో మీకు ఎన్‌కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్ గురించి బోధిస్తారు. ఇది మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలో కీలకమైన భాగం. మెషిన్ ట్రాన్స్‌లేషన్, టెక్స్ట్ సారాంశం, ప్రశ్నలకు సమాధానమివ్వడం వంటి సీక్వెన్స్-టు-సీక్వెన్స్ టాస్క్‌లను రూపొందించేందుకు ఎన్‌కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్‌ను వినియోగిస్తారు. దాన్ని ఎలా వినియోగించాలి? అనేది నేర్పిస్తారు. TensorFlow అనే ఓపెన్ సోర్స్ మెషీన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ఎన్‌కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్‌ను వినియోగించడంపై మెలకువలు బోధిస్తారు.