Stock Market Close :రోజంతా తీవ్రమైన ఒడుదొడుకుల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 964 పాయింట్లు నష్టపోయి 79,218 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 247 పాయింట్లు కోల్పోయి 23,951 వద్ద ముగిసింది. వచ్చే ఏడాది మరికొన్ని దఫాల్లో వడ్డీ రేట్ల కోత ఉంటుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయేందుకు ప్రధాన కారణమైంది.
- నష్టపోయిన షేర్లు : ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, టెక్‌మహీంద్రా, బజాజ్‌ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ , హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్
- లాభపడిన షేర్లు :హెచ్‌యూఎల్, ఐటీ, సన్‌ఫార్మా
అంచనాలకు తగ్గట్లుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్- కీలక వడ్డీ రేట్లలో కోత విధించింది. కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఉద్యోగ, ద్రవ్యోల్బణ గణాంకాల్లో ప్రగతి నేపథ్యంలో వడ్డీ రేట్లను ప్రస్తుత 4.50-4.75 శాతం నుంచి 4.25-4.50 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ఫెడ్ ప్రకటించింది. అయితే భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గింపు అంతలా ఉండకపోవచ్చంటూ బలమైన సంకేతాలు ఇచ్చింది. దీంతో బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్లు భారీగా క్షీణించాయి. దీని ప్రభావం భారత దేశీయ సూచీలపై పడింది. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి.
దారుణంగా పతనమైన రూపాయి విలువ
మరోవైపు దేశ కరెన్సీ రూపాయి విలువ కూడా భారీగా క్షిణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 85 స్థాయిని దాటింది. ఈ మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2025లో వడ్డీ రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని పేర్కొనడం వల్ల మన రూపాయితో పాటు, వర్ధమాన దేశాల కరెన్సీలపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే రూపాయి మారకం విలువ గురువారం ఉదయం 85.06 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుతం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 85.06గా ఉంది.