Satya Nadella Life Lessons :సత్య నాదెళ్ల - పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశంలో పుట్టి, పెరిగి ఇప్పుడు ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, సీఈఓగా పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ ఉన్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఆయన నాయకత్వంలోనే విజయపథంలో నడుస్తోంది. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెళ్ల ఇటీవలే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్‌ను అభివృద్ధి పథంలో నడిపించడంలో సత్య నాదెళ్ల కీలక పాత్ర పోషించారు. అయితే సత్య నాదెళ్ల విజయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అవేమిటో ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో తెలియజేశారు. మరి మనమూ వాటి గురించి తెలుసుకుందామా?
'ఎక్కువగా వినండి- తక్కువగా మాట్లాడండి'
మనం ఏ పనిలో రాణించాలన్నా, 'ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి' అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 2015లో వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే సమయం వచ్చినప్పుడు 'నిర్ణయాత్మకంగా ఉండాలని' సూచించారు. అంటే మీరు అనుకున్నది చేయడానికి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
'చిన్న చిన్న విషయాలు కూడా ఎల్లప్పుడూ మన నియంత్రణలో ఉండవు. అయినప్పటికీ వాటిని మన అదుపులో పెట్టుకోవడానికి తగిన శక్తిని సంపాదించుకోవాలి' అని 2019లో చికాగో బూత్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల చెప్పారు. అలాగే ప్రతి ఉద్యోగి అన్ని విషయాల్లోనూ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల వారి పని సామర్థ్యం పెరుగుతుందని సత్య నాదెళ్ల స్పష్టం చేశారు.
నాయకత్వం అనేది విశేషాధికారమో, ప్రత్యేకమైన సౌకర్యమో కాదని సత్య నాదెళ్ల అన్నారు. సంస్థకు నాయకత్వం వహించేవారు ఉద్యోగుల భావనలు, ఆలోచనలు, సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. అదొక కష్టతరమైన స్కిల్ అని, దానిని నేర్చుకోవడం చాలా కష్టమని ఆక్సెల్ స్ప్రింగర్ మథియాస్ డాప్ఫ్నర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
సంస్థల అధినేతలను ఉద్దేశిస్తూ, 'మీకు మీ ఉద్యోగుల పట్ల నమ్మకం ఉంటే, వారు మంచి పనితీరు కనబరుస్తారు. దీంతో మీరు కూడా అభివృద్ధి చెందుతారు' అని 2020లో ఓ పోడ్‌కాస్ట్ ఎపిసోడ్లో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు.