How To Close Fixed Deposit Account Before Maturity : భవిష్యత్తు ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, నిర్దిష్ట కాలపరిమితితో బ్యాంకులో పెట్టిన పెట్టుబడినే ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటారు. వాస్తవానికి ఎఫ్డీలనే టర్మ్ డిపాజిట్లు అని కూడా అంటారు. ఒక నిర్దిష్ట కాలపరిమితితో తీసుకున్న ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ వల్ల ఎలాంటి నష్టభయం లేని రాబడి వస్తుంది. ముఖ్యంగా ఎఫ్డీ మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత దానిపై మంచి వడ్దీ వస్తుంది. దీన్ని అత్యుత్తమమైన పెట్టుబడిగా కూడా చాలా మంది భావిస్తారు. ఎందుకంటే దీనిపై ఎలాంటి నష్టం ఉండదు. పైగా వడ్డీ కూడా వస్తుంది. అందుకే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపే జనం ఎక్కువగా మొగ్గు చూపుతారు.
మెచ్యూరిటీ కాకుండా ఎఫ్డీ క్లోజ్ చేస్తే ఏమౌతుంది?
మనకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు, మెచ్యూరిటీ తేదీ కంటే ముందే, ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను క్లోజ్ చేసుకోవచ్చు. కానీ దీని వల్ల మనకు రావాల్సినంత వడ్డీ లభించదు. పైగా ఎఫ్డీ అకౌంట్ క్లోజింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి వస్తుంది. బ్యాంక్ బజార్.కామ్ ప్రకారం, చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ముందస్తు ఉపసంహరణకు కొంత రుసుమును విధిస్తాయి. సాధారణంగా ఈ పెనాల్టీ వడ్డీ రేటులో 0.5% నుంచి 1 % వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ జరిమానాను విధించకుండా ఉంటాయి. కానీ అలాంటి బ్యాంకులు చాలా తక్కువే.