తెలంగాణ

telangana

ETV Bharat / business

మీరు ఉద్యోగులా? '50:30:20 స్ట్రాటజీ'తో సాలరీని మేనేజ్ చేయండిలా! - How Much To Save In Salary - HOW MUCH TO SAVE IN SALARY

How Much To Save In My Salary : మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీకు వచ్చిన జీతంలో ఎంత మొత్తం పొదుపు, మదుపులకు కేటాయించాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. ఉద్యోగులు తమ జీతంలో ఎంత మొత్తాన్ని పొదుపు చేయాలి? ఎంత మొత్తం పెట్టుబడులకు కేటాయించాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

How Much Should I Save Each Month
How to Save Money from Your Monthly Salary (ETV BHARAT TELUGU TEAM)

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 11:41 AM IST

How Much To Save In My Salary : వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే, భవిష్యత్‌ ఆర్థిక లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కచ్చితంగా పొదుపు, పెట్టుబడులపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. జీతం రాగానే, మొత్తం డబ్బులు ఖర్చు పెట్టేయకూడదు. కొంత సొమ్మును పొదుపు చేసుకోవాలి. మరికొంత మదుపు చేయాలి. వాస్తవానికి ఇదో అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే మీ భవిష్యత్ భద్రంగా ఉంటుంది.

స్వల్పకాలంలో ఆర్థిక లక్ష్యాలను సాధించడం అంత సులువు కాదు. ఇందుకోసం పక్కా ప్రణాళికలు వేసుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణతో పొదుపు, మదుపులు కొనసాగించాలి. అయితే మనకు వచ్చే ఆదాయంలో ఎంత శాతం వరకు పొదుపు చేయాలనే దానికి ఒక కచ్చితమైన సమాధానం ఉండదు. మీకున్న బాధ్యతలు, ఆర్థిక లక్ష్యాలు, నష్టాన్ని భరించే శక్తి, సామర్థ్యాల ఆధారంగా ఎంత పొదుపు చేయాలనేది మారుతూ ఉంటుంది.

ఆర్థిక లక్ష్యాలు!
మీ వేతనంలో లేదా ఆదాయంలో ఎంత శాతాన్ని పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలనేది నిర్ణయించుకునే ముందు, మీ ఆర్థిక లక్ష్యాలను పూర్తిగా విశ్లేషించుకోవాలి. సొంతంటి కలలు, పిల్లల చదువులు, రిటైర్​మెంట్​ ప్లాన్​ - ఇలా అన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు గురించి ఆలోచించాలి. వీటికి అనుగుణంగా మీ పెట్టుబడులు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. దేనికి ఎంత ఖర్చు చేయాలి, ఎందులో పొదుపు చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, వేటిని వాయిదా వేయాలి అనేది మీరే స్వయంగా ఆలోచించుకోవాలి. ఇందుకోసం ఒక పక్కా ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే ఎంత మేరకు పొదుపు, మదుపు చేయాలనే దానిపై ఓ స్పష్టత వస్తుంది.

50:30:20 స్ట్రాటజీ
పెట్టుబడులకు సంబంధించి 50:30:20 స్ట్రాటజీని వాడుకోవచ్చు. ఈ స్ట్రాటజీ ప్రకారం, మీకు వచ్చిన ఆదాయంలో 50 శాతాన్ని మీ దైనందిన అవసరాల కోసం కేటాయించాలి. 30 శాతం సొమ్మును మీ సరదాలు, కోరికలు తీర్చుకోవడానికి వినియోగించాలి. మిగతా 20 శాతాన్ని పొదుపు, పెట్టుబడులకు మళ్లించాలి. అయితే ఈ నియమాన్ని స్ట్రిక్ట్​గా పాటించాల్సిన అవసరం లేదు. మీ ఆర్థిక అవసరాలు, బాధ్యతలు, లక్ష్యాలకు అనుగుణంగా దీనిలో స్వల్ప మార్పులు చేసుకోవచ్చు.

నిత్యావసరాలు, బిల్లులు, పిల్లల ఫీజులు, రుణ వాయిదాల చెల్లింపులు మొదలైన వాటికి కచ్చితంగా సొమ్ము కేటాయించాల్సి ఉంటుంది. వీటి నుంచి మనం తప్పించుకోలేము. ఇవి కాకుండా మనకంటూ కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవాలి. ఎలాగే విందులు, వినోదాలు, విహార యాత్రలు చేయాల్సి వస్తుంది. వీటికి కూడా కొంత ఖర్చు పెట్టాలి. మిగిలిన సొమ్మును పొదుపు చేయడంగానీ, పెట్టుబడి పెట్టడం గానీ చేయాలి. అయితే వీలైనంత వరకు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కొన్ని ఆశలు, కోరికలు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. అవసరమైతే వాటిని వాయిదా వేసి, పొదుపు, పెట్టుబడులకు ఆ డబ్బును కేటాయించాలి.

రిస్క్ ఎక్కువగా ఉండే స్టాక్​ మార్కెట్​లో మీ డబ్బులు పెట్టాలనుకుంటే, ముందుగా మీరు ఎంత వరకు నష్టాన్ని భరించగలరో ఒక అంచనాకు రావాలి. అయితే రిస్క్ ఎక్కువ ఉన్నచోటే లాభం కూడా ఎక్కువ ఉంటుంది. సురక్షితమైన పథకాల్లో పొదుపు చేస్తే, రాబడి కాస్త తక్కువగా ఉంటుంది.

పెట్టుబడుల్లో వైవిధ్యంగా ఉండాలి!
మీ పెట్టుబడుల్లో కచ్చితంగా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీలు, బాండ్లు, మ్యూచువల్‌ ఫండ్లు, బంగారం, రియల్ ఎస్టేట్​ (స్థిరాస్తులు) - ఇలా భిన్నమైన పథకాలను ఎంచుకోవాలి. దీని వల్ల నష్టభయం తగ్గుతుంది. భవిష్యత్​లో మంచి కార్పస్ (నిధి) జమ అయ్యే వీలుంటుంది.

సమీక్షిస్తూ ఉండాలి!
ఇన్వెస్ట్​ చేసి ఊరుకుంటే సరిపోదు. మీ పెట్టుబడులను ఎప్పటికప్పుడూ సమీక్షించుకుంటూ ఉండాలి. కాలానుగుణంగా, అవసరాలకు అనుగుణంగా మీ పోర్ట్​ఫోలియోలో మార్పులు, చేర్పులు చేసుకోవాలి. జీతం పెరిగినప్పుడల్లా మీ పెట్టుబడులను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇలా చేస్తే మీ ఆర్థిక భవిష్యత్ కచ్చితంగా బాగుంటుంది.

త్వరగా రిటైర్ కావాలని అనుకుంటున్నారా? 'FIRE స్ట్రాటజీ'పై ఓ లుక్కేయండి! - FIRE Strategy

మంచి స్పోర్ట్స్​ బైక్ కొనాలా? రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్​-5 ఆప్షన్స్​ ఇవే! - Best Sports Bike

ABOUT THE AUTHOR

...view details