Second Hand Car Loan :పాత కారు కొనాలని అనుకుంటున్నారా? దీనికోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ కార్లకు కూడా రుణం ఇస్తున్నాయి. కాకపోతే ఇలాంటి లోన్లు తీసుకునే ముందు మనం కొన్ని నిబంధనలను అర్థం చేసుకోవాలి. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు వేసుకుంటే, రుణ దరఖాస్తు తిరస్కరించకుండా కారు కొనేందుకు అవసరమైన లోన్ లభిస్తుంది.
తక్కువ క్రెడిట్ స్కోరు (Credit score) ఉంటే లోన్లు లభించడంలో ఇబ్బంది ఎదురవుతుంది. కొన్ని సందర్భాల్లో కొత్త రుణాలు రాకుండా తక్కువ క్రెడిట్ స్కోర్ అడ్డుకుంటుంది. కాబట్టి, కారు కొనేందుకు మీరు రుణం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నప్పుడు, ముందుగా మీ క్రెడిట్ స్కోరు ఎంతుందో తెలుసుకోండి.
- ఒకవేళ స్కోరు మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉండి, రుణం ఇవ్వడానికి తిరస్కరించే అవకాశం ఉందని భావిస్తే, కొన్ని రోజులు మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి. మీ ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించండి. కొత్తగా అప్పులను తీసుకునేందుకు బ్యాంకులను సంప్రదించకూడదు.
- ఆదాయంతో పోలిస్తే రుణాలు అధిక నిష్పత్తిలో ఉన్నప్పుడు కూడా కొత్త లోన్ రాకపోవచ్చు. మీరు ఇప్పటికే ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నారని రుణ సంస్థలు భావిస్తాయి.
- మీ రుణ నిష్పత్తిని తగ్గించుకునేందుకు ఇప్పటికే ఉన్న అప్పులను చెల్లించండి. ముందుగా అధిక వడ్డీ ఉన్న వాటిని వదిలించుకోండి.
- ప్రతి ఆర్థిక సంస్థ నిర్ణీత మొత్తంలో ఆదాయం ఉన్న వారికే అప్పులు ఇస్తామని ముందుకు వస్తుంది. ఇలాంటప్పుడు మీ ఆదాయం సరిపోయేంత లేకపోతే రుణం రాకపోవచ్చు.
- మీకు స్థిరమైన ఆదాయం ఉన్నట్లు రుజువులను బ్యాంకు/ఎన్బీఎఫ్సీకి అందించండి. అదనపు ఆదాయాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పండి. మీ దరఖాస్తును తిరస్కరించకుండా అవసరమైతే సహ దరఖాస్తుదారు మద్దతు తీసుకోండి.
- పాత కారు కోసం మీరు తక్కువ మొత్తం (డౌన్ పేమెంట్) చెల్లించి, రుణం అధికంగా కోరినప్పుడు బ్యాంకులు సహజంగానే ఆ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.
- లోన్ మొత్తం తక్కువగా ఉండేలా చూసుకుంటూ, సొంతంగా కాస్త అధికంగా చెల్లిస్తే రుణ దరఖాస్తు (Loan Application) ఆమోదం పొందుతుంది.