Mutual Fund Investment Mistakes : డబ్బు పొదుపు చేసేందుకు చాలా మంది చిన్న పొదుపు పథకాలపై ఆధారపడుతుంటారు. మరికొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడికి సంబంధించిన ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యం నెరవేరేందుకు తగినంత పెట్టుబడులు పెట్టగలరా, లేదా అనేది చూసుకోవాలి. క్రమబద్ధమైన (SIP) విధానాన్ని అనుసరించాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి రాబడులు సంపాదించే అవకాశం పెరుగుతుంది. అయితే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ తెలిసీ, తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల వారి ఆర్థిక లక్ష్యాలు నెరవేరే అవకాశం బాగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. అందుకే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లో చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సరైన లక్ష్యం లేకపోవడం!
స్వల్పకాలిక లాభాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సరికాదు. కనీసం ఏడేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలి. అంతకంటే దీర్ఘకాలం పెట్టుబడి కొనసాగించడం మంచిది. మార్కెట్ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అలాకాకుండా స్వల్పకాలిక దృష్టితో, సరైన లక్ష్యం లేకుండా పెట్టుబడులు పెడితే నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే, స్టాక్ మార్కెట్లో స్వల్పకాలంలో అనేక ఒడుదొడుకులు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో తక్కువ ధరకే మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేయడానికి అవకాశం లభిస్తుంది. క్రమశిక్షణతో దీర్ఘకాలంపాటు మదుపు చేస్తుంటే, మ్యూచువల్ ఫండ్స్ మంచి లాభాలనే తెచ్చిపెడతాయని చరిత్ర చెబుతోంది.
సరిపడా పెట్టుబడులు పెట్టకపోవడం!
చాలా మందికి పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. కానీ వాటి సాధించేందుకు తగిన పెట్టుబడులు మాత్రం పెట్టరు. దీని వల్ల తమ లక్ష్యాలను సాధించలేక ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకు, మీరు ఓ 20 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అనుకుందాం. కానీ నెలవారీగా రూ.1000 మాత్రమే పెట్టుబడిపెడుతున్నారు. లేదా ఏకమొత్తంగా రూ.1 లక్ష మాత్రమే పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక లక్ష్యం నెరవేరదు.
వాస్తవానికి మీరు 20 ఏళ్లలో కోటి రూపాయలు సంపాదించాలంటే, ఇప్పటి నుంచే నెలవారీగా రూ.7,550 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. లేదా ఓకేసారి రూ.6.1 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అప్పుడే 20 ఏళ్ల తరువాత మీరు ఒక కోటి రూపాయల నిధిని సంపాదించగలుగుతారు.
సమయానికి సిప్ చేయకపోవడం!
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ను తూచా తప్పకుండా పాటించాలి. అలా కాకుండా మీకు నచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడం లేదా పూర్తిగా నిలిపివేయడం వల్ల మీ ఆర్థిక లక్ష్యం నెరవేరకుండా పోతుంది. మీకు రావాల్సిన యూనిట్లు క్రమంగా తగ్గిపోతాయి. కొంత మంది మంచి లాభాల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ నుంచి అవసరం లేకపోయినా డబ్బులు తీసేస్తూ ఉంటారు. మరికొందరు నష్టభయంతో అర్థాంతరంగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉంటారు. దీని వల్ల నష్టపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది.