Cashless Health Insurance News :ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. ఆరోగ్య బీమా తీసుకున్న వారు అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో గురువారం నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు 'ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్' ప్రకటించింది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలతో చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. బీమా పాలసీ నెట్వర్క్ జాబితాలో పేరు లేని ఆస్పత్రుల్లోనూ క్యాష్‌లెస్ సదుపాయాన్ని పొందవచ్చని స్పష్టం చేసింది.
నెట్వర్క్ హాస్పిటల్ జాబితాలో లేని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయం పొందాలనుకుంటే 48 గంటల ముందే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అత్యవసర సందర్భాల్లో అయితే ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోపు సమాచారం చేరవేయాల్సి ఉంటుంది. బీమా పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిమ్ చేసుకోవచ్చని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వివరించింది.
ప్రస్తుతం ఇలా!
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సంబంధిత నెట్వర్క్ ఆస్పత్రుల్లో మాత్రమే క్యాష్‌లెస్ సేవలకు అనుమతి ఉంటుంది. ఈ సదుపాయం లేని చోట చికిత్సకు అయ్యే ఖర్చును సొంతంగా జేబులోంచి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఖర్చులకు సంబంధించి రీయంబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం వల్ల కస్టమర్లకు ఇబ్బందులు ఎదురయ్యేవి. రిఫండ్ ప్రక్రియ సైతం ఆలస్యంగా జరిగేది. తాజా నిర్ణయం నేపథ్యంలో కస్టమర్లకు ఈ సమస్యలు తప్పనున్నాయి. 'క్యాష్‌లెస్' సదుపాయంపై ఇప్పటికే ఆయా బీమా కంపెనీలు కస్టమర్లకు మెసేజ్‌లు పంపిస్తున్నాయి.