Airtel Emergency Validity Loan :ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్లలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చే దిశగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే తమ కస్టమర్లకు డేటాను అప్పుగా ఇస్తున్న ఎయిర్‌టెల్ మరో ముందడుగు వేసింది. తాజాగా 'ఎమర్జెన్సీ వ్యాలిడిటీ లోన్' వసతిని అందుబాటులోకి తెచ్చింది. యాక్టివ్‌గా ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అత్యవసరం కోసం 'వ్యాలిడిటీ లోన్' సదుపాయాన్ని యూజర్లు వాడుకోవచ్చు. ఈ లోన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు 1.5 జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే దీని వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే ఉంటుంది. బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసిన వెంటనే రీఛార్జ్ చేసుకోలేని వారికి, అత్యవసర సమయాల్లో ఈ ఎమర్జెన్సీ వ్యాలిడిటీ లోన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ లోన్ పొందండిలా!
How To Get Emergency Loan In Airtel : ఎయిర్‌టెల్ 'వ్యాలిడిటీ లోన్'ను పొందడం చాలా ఈజీ!! ఎలా అంటే- ఎయిర్‌టెల్ ఐవీఆర్ ప్రీకాల్ అనౌన్స్‌మెంట్ లేదా యూఎస్‌ఎస్‌డీ కోడ్ *567*2# డయల్ చేసి వ్యాలిడిటీ లోన్‌ను వాడుకోవచ్చు. బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగియగానే సీఎల్‌ఐ 56323 నుంచి వచ్చే మెసేజ్‌కు '1'తో రిప్లై ఇచ్చి కూడా లోన్ కోసం రిక్వెస్టును పంపవచ్చు. ఇలా ఇచ్చే లోన్‌ను ఎయిర్‌టెల్ తర్వాతి రీఛార్జ్ నుంచి రికవర్ చేసుకుంటుంది. కొత్త ప్లాన్‌లో ఒక రోజు గడువును తగ్గించడం ద్వారా రికవరీ ప్రాసెస్ ముగిసిపోతుంది.
ప్రస్తుతానికి ఈ రాష్ట్రాల్లోనే
రూ.115 నుంచి మొదలుకొని రూ.3,359 దాకా వివిధ రీఛార్జ్ ప్లాన్‌లలో ఈ వ్యాలిడిటీ లోన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. లోన్ తీసుకున్న తర్వాత దాన్ని రికవర్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోకపోతే, మరోసారి వ్యాలిడిటీ లోన్ పొందడానికి అర్హత ఉండదు. ప్రస్తుతానికి ఈ ఆఫర్‌ను ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లోని ఎయిర్‌టెల్ సర్వీసు ఏరియాల్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఆఫర్‌ను అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.