YS Sharmila To Visit Idupulapaya YSR Ghat:రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే రాజశేఖర్ రెడ్డి కలను నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఆదివారం పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఈరోజు సాయంత్రం ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
సిద్దాంతాల కోసం వైఎస్సార్ ఎంత దూరం అయినా వెళ్లే వాడు: దేశంలోనే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ సిద్ధాంతాలను కొనసాగించడానికి చివరి వరకు కృషి చేస్తానని వైఎస్ షర్మిల అన్నారు. రేపు ఉదయం విజయవాడ లో ఏపీ పీసీసీ చీఫ్ గా భాద్యతలు తీసుకుంటున్న సందర్భంగా ఇవ్వాళ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చానని చెప్పారు. వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరానన్నారు. వైఎస్సార్ కు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానం అన్నారు. సిద్ధాంతాల కోసం వైఎస్సార్ ఎంత దూరం అయినా వెళ్లే వాడని షర్మిల పేర్కొన్నారు. ఇవ్వాళ దేశంలో సెక్యులరిజం అనే పదానికి, ఫ్యూడలిజం అనే పదాలకు అర్థం లేకుండ పోయిందన్నారు. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది- ఇవన్నీ మళ్లీ నెలకొనాలనీ వైఎస్ షర్మిల ఆకాంక్షించారు.
షర్మిల వల్ల వైఎస్సార్సీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు: సజ్జల
పార్టీకి పూర్వ వైభవం వస్తుంది: రాజశేఖరరెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించిన తరహాలోనే షర్మిలమ్మను కూడా ప్రతి కార్యకర్త అభిమానించాలని పిలుపునిచ్చారు. షర్మిలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని కేవీపీ రామచంద్రరావు అభ్యర్థించారు.